రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యం

  • కాంగ్రెస్ బలోపేతం కోసం రాజీలేని పోరాటం
  • పార్టీకి దూరంగా ఉంటున్నాననే ప్రచారంలో వాస్తవం లేదు
  • ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : దేశంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం చౌటుప్పల్ కు వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల తాను రాహుల్ గాంధీని కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. “తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకునికి ఇవ్వనంత సమయాన్ని రాహుల్ గాంధీ నాకు కేటాయించారు. ఆయనతో పార్టీ నిర్ణయాలు, కుటుంబ విషయాలపై సుదీర్ఘంగా చర్చించాను. ఆయన సమయం ఇచ్చి నాతో మాట్లాడిన మాటలకు ఎంతో ప్రభావితమయ్యాను. రాహుల్ గాంధీ ఎంతో మానవత్వం ఉన్న వ్యక్తి, ఆయన నాయకత్వంలో పనిచేయడం గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు. పార్టీలో తనకు ఆ స్థాయి గుర్తింపు ఉందని ఆయన గుర్తుచేశారు.

​కార్యకర్తలను కాపాడుకుంటాం..

​రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ప్రజల మనసుల్లో ఏముంది.. వారికి ఏం చేయాలనే కోణంలో ఆలోచన చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పార్టీ కోసం మొదటి నుంచి కష్టపడిన పాత కార్యకర్తలకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని, వారిని కాపాడుకునే విషయంలో వెనకడుగు వేసేదే లేదని స్పష్టం చేశారు. తాను పార్టీకి దూరంగా ఉంటున్నాననే ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, నిరంతరం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నానని తేల్చిచెప్పారు.

​ఆ వ్యాఖ్యలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో చేసినవి కావు..

​ఇటీవల యాదగిరిగుట్ట పాలకవర్గం నియామకం విషయంలో తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “యాదగిరిగుట్ట విషయం తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది. అంతేకానీ అది పార్టీ మీదనో, ప్రభుత్వం మీదనో ఉన్న వ్యతిరేకతతో అన్న మాటలు కావు. పార్టీ తీసుకునే కొన్ని నిర్ణయాలను తప్పుబడుతున్నానే తప్ప.. పార్టీని కాదు” అని వివరణ ఇచ్చారు. తెలంగాణలో రాబోయే ఐదు సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటానికి, పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తానని రాజగోపాల్ రెడ్డి పునరుద్ఘాటించారు. ​ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మన్ గోశిక వినయ్ కుమార్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, ఆ గ్రామాల సర్పంచులు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.