ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ…

  • సామాన్య భక్తులకే ప్రాధాన్యం
  • ఆదివారం సెలవు నేపథ్యంలో భారీగా తరలివచ్చిన భక్తులు
  • అంతరాలయ, వీఐపీ దర్శనాలు తాత్కాలికంగా రద్దు..
  • సాధారణ భక్తులకు వేగవంతమైన దర్శనం
  • క్యూ లైన్లలోనే చల్లని తాగునీరు, అన్నదానం, ప్రసాదాల పంపిణి
  • అధికారుల పర్యవేక్షణతో ప్రశాంతంగా సాగిన దర్శనాలు

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేగవంతమైన దర్శనం కల్పించడంతో పాటు తాగునీరు, అన్నదానం, ప్రసాదాల పంపిణీ వంటి సౌకర్యాలను సమర్థంగా నిర్వహించి భక్తుల ప్రశంసలు అందుకున్నారు.

ఆదివారం సెలవు నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన ఆలయ అధికారులు డీఈఓ కిషోర్ కుమార్ పర్యవేక్షణలో ఏఈవోలు చంద్రశేఖర్, రమేష్‌బాబు క్యూ లైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించారు.

అంతరాలయ దర్శనం రద్దు..

అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ తీవ్రత అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఉదయం 10.30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అదే సమయంలో మధ్యాహ్నం 2.15 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను కూడా రద్దు చేయడంతో క్యూ లైన్లలో వేచి ఉన్న వేలాది మంది భక్తులకు వేగంగా అమ్మవారి దర్శనం లభించింది.

ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ యంత్రాంగం చేపట్టిన మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా క్యూ లైన్లలోనే చల్లని తాగునీటిని అందించే వినూత్న విధానానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. లైన్లలో నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా నీరు అందించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా ఉచిత ప్రసాదం, అన్నదానాన్ని కూడా నిరంతరాయంగా నిర్వహించారు.

మధ్యాహ్నం తర్వాత రద్దీ క్రమంగా తగ్గుముఖం పట్టగా, ధర్మకర్తల మండలి సభ్యులు, అధికారులు స్వయంగా క్యూ లైన్లలో పర్యటిస్తూ భక్తుల సౌకర్యాలను పరిశీలించారు. ఆలయ సహాయ కమిషనర్ రంగారావు సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ క్యూ లైన్ల నిర్వహణను సమర్థంగా పర్యవేక్షించారు. పాలకమండలి, అధికారులు, సిబ్బంది సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్ల కారణంగా భారీ రద్దీ మధ్య కూడా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా దర్శనాలు ప్రశాంతంగా జరిగాయి.