Bonalu | రాష్ట్రస్థాయి చేతివృత్తుల మేళా

జూలై 16 నుంచి హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో వస్తు ప్రదర్శన
ఆషాఢ బోనాల సంద‌ర్భంగా హైదరాబాద్‌లో అమ్మకాల మేళా
బోనాలకు అవసరమైన పూజా సామగ్రి, మట్టి కుండలు, వెదురు, రాగి, పిత్తళి వస్తువులు ఒకేచోట

Bonalu | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : ఆషాఢ బోనాల పండుగను పురస్కరించుకుని సంప్రదాయ చేతివృత్తి కళాకారులను ప్రోత్సహించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌ (పెద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం సమీపంలో) రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన–అమ్మకాల మేళాను నిర్వహించనుంది.

ఆషాఢ మాసంలో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా జరిగే బోనాల ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రస్థాయి చేతివృత్తి కళాకారుల వస్తు ప్రదర్శన–అమ్మకాల మేళాను నిర్వహించనుంది. ఈ మేళా జూలై 16 నుంచి హైదరాబాద్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో జరగనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సంప్రదాయ కులవృత్తులకు చెందిన కళాకారులు ఈ మేళాలో పాల్గొంటారు. వారికి ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసి, వారు తయారు చేసిన వస్తువులను నేరుగా వినియోగదారులకు విక్రయించే అవకాశం కల్పించనున్నారు. దీంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కళాకారులకు నేరుగా ఆదాయం లభించే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

బోనాల పండుగ సందర్భంగా అవసరమయ్యే మట్టి బోనం కుండలు, పూజా సామగ్రి, వెదురు ఉత్పత్తులు, రాగి, పిత్తళి పాత్రలు, సంప్రదాయ హస్తకళ వస్తువులు ఈ మేళాలో అందుబాటులో ఉండనున్నాయి. భక్తులు తమకు అవసరమైన పూజా సామగ్రిని ఒకేచోట కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు చేతివృత్తుల ఉత్పత్తులకు మార్కెట్‌ను విస్తరించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ సంప్రదాయ కళలు, కులవృత్తులను పరిరక్షించడంతో పాటు కళాకారుల జీవనోపాధిని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ప్రజలు పెద్ద సంఖ్యలో మేళాను సందర్శించి చేతివృత్తి కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. బోనాల పండుగకు ముందు నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక మేళా సంప్రదాయ కళలకు ప్రాధాన్యం కల్పించడంతో పాటు కళాకారులకు ఆర్థికంగా ఊతమివ్వనుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.