బాలాలయంలోనే అమ్మవారి దర్శనాలు..

బాసర (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఉత్సవమూర్తులను బాలాలయంలో ప్రతిష్ఠించిన నేపథ్యంలో భక్తులు బాలాలయంలోనే అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాటక్, ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, ఆలయ ఈవో అంజనీదేవి తెలిపారు.

బాలాలయంలో రూ.1,000 టికెట్‌తో అక్షరాభ్యాస పూజలు, ధ్యాన మందిరంలో రూ.150 టికెట్‌తో అక్షరాభ్యాస పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఈ ఏర్పాట్లకు భక్తులు సహకరించాలని కోరారు.

ఆలయ పునర్నిర్మాణ పనుల నేపథ్యంలో బాసర అమ్మవారి ప్రధాన గర్భగుడి, మహాకాళి అమ్మవారి ఆలయంలో భక్తుల దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం నుంచి బాలాలయంలో ప్రతిష్ఠించిన ఉత్సవమూర్తులను మాత్రమే భక్తులు దర్శించుకోవాలని ఆలయ అధికారులు, అర్చకులు సూచించారు.