గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మర గాలింపు
ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
కోస్టుగార్డు నౌకలు, నేవీ హెలికాప్టర్లతో సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశం
కుప్పం, ఆంధ్రప్రభ : విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలోనే ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారులను సురక్షితంగా గుర్తించి రక్షించేందుకు చేపట్టిన చర్యల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులు ఇప్పటివరకు చేపట్టిన గాలింపు చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. కోస్టుగార్డు నౌకలతో పాటు ఇతర రక్షణ బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలిస్తున్నాయని తెలిపారు. అలాగే నేవీ హెలికాప్టర్ల ద్వారా కూడా గాలింపు, సహాయక చర్యలను మరింత విస్తరించినట్లు వివరించారు.
మత్స్యకారుల ప్రాణాలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కోస్టుగార్డు నౌకలతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. సముద్రంలో ఎక్కడా గాలింపు లోపం లేకుండా అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
మెరైన్ పోలీసు ఉన్నతాధికారులు, విశాఖ నగర పోలీసు కమిషనర్‌తో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూ గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రక్షణ చర్యల్లో పాల్గొంటున్న అన్ని విభాగాలు సమిష్టిగా పనిచేసి మత్స్యకారుల ఆచూకీని త్వరగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
గాలింపు చర్యల పురోగతిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, వారిని సురక్షితంగా రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు కొనసాగుతాయని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
