స్వచ్ఛంద సేవకు రక్తదానం గొప్ప నిదర్శనం
కోడూరు, (ఆంధ్రప్రభ): స్వచ్ఛంద సేవలో రక్తదానం అత్యున్నతమైనదని, ప్రతి ఆరోగ్యవంతుడు సామాజిక బాధ్యతగా రక్తదానం చేయాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పిలుపునిచ్చారు. కోడూరు మండలం పోటుమీద గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ కడవకొల్లు పూర్ణచంద్రరావు జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఆదివారం నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పూర్ణచంద్రరావు సేవా భావాన్ని కొనసాగిస్తూ ఆయన కుటుంబ సభ్యులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆయన సతీమణి శిఖరం గాయత్రి, కుమారుడు కడవకొల్లు ప్రసాద్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.
రక్తదానం వల్ల అత్యవసర శస్త్రచికిత్సలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు, రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు సకాలంలో ప్రాణరక్షణ అందుతుందని తెలిపారు. ఒక్క యూనిట్ రక్తం పలువురి ప్రాణాలను కాపాడగలదని, యువత పెద్దఎత్తున రక్తదాన శిబిరాల్లో పాల్గొని మానవతా దృక్పథాన్ని చాటాలని కోరారు.
అనంతరం రక్తదానం చేసిన దాతలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు, జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మత్తి వెంకటేశ్వరరావు, మాజీ సర్పంచ్ మండలి ఉదయభాస్కర్, గ్రామ ప్రముఖులు, నాయకులు, శిబిర నిర్వాహకులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
