రోడ్ల మరమ్మతులకు సీపీఎం నిరాహార దీక్ష..
వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రోడ్ల దుస్థితిని వెంటనే సరిచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం బీజేఆర్ చౌరస్తా వద్ద నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మైపాల్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే రోడ్లు అధ్వానంగా ఉండడం విచారకరమని అన్నారు.
ఎన్‌టీఆర్ చౌరస్తా నుంచి బీజేఆర్ చౌరస్తా వరకు రహదారి పూర్తిగా దెబ్బతిన్నందున వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాల కారణంగా గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ఈ మార్గంలో ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు.
బీజేఆర్ చౌరస్తా వద్ద రహదారిని వెంటనే మరమ్మతులు చేయాలని, వికారాబాద్ పట్టణంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
