Bear Movement | శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్ల కలకలం

ప్రజల్లో భయాందోళన

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: శ్రీ సత్యసాయి జిల్లాలోని గుడిబండ మండల కేంద్రంలో ఎలుగుబంట్ల సంచారం స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఎస్సీ కాలనీలో వరుసగా మూడు రోజులుగా ఎలుగుబంట్లు కనిపిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.

తాజాగా రాత్రి సమయంలో ఓ ఎలుగుబంటి కాలనీలోకి చొరబడి ఓ ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. ఇది గమనించిన స్థానిక యువకులు వెంటనే కేకలు వేయడంతో అప్రమత్తమైన వారు కర్రల సహాయంతో ఎలుగుబంటిని తరిమికొట్టారు. దీంతో అది తిరిగి సమీపంలోని కొండ ప్రాంతంలోకి వెళ్లిపోయింది.

ఈ ఘటనలతో కాలనీవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలుగుబంట్ల సంచారం కొనసాగితే ప్రమాదం తప్పదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.