వివేకానంద నేటి యువతకు స్ఫూర్తిదాయకం
- చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి
చేవెళ్ల, ఆంధ్రప్రభ : “లేచి నిలబడండి.. మేల్కొనండి.. లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించకండి” అనే స్వామి వివేకానంద సందేశం నేటి యువతకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని చేవెళ్ల మున్సిపల్ చైర్‌పర్సన్ దేవర సమత వెంకట్ రెడ్డి అన్నారు.
స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా చేవెళ్ల పట్టణంలోని స్వామి వివేకానంద విగ్రహానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సందర్భంగా మాట్లాడుతూ యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం పెంపొందించడంలో స్వామి వివేకానంద బోధనలు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, ప్రతి చిన్నారికి విద్యను అందించడం, యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగడం, సమాజంలో పరస్పర గౌరవం, ఐకమత్యం, సేవాభావంతో జీవించడం ద్వారా స్వామి వివేకానంద ఆశయాలను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.
చేవెళ్ల అభివృద్ధికి ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని, “మన ఊరు–మన బాధ్యత” అనే భావనతో కలిసి పనిచేస్తే చేవెళ్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ సర్పంచ్, కౌన్సిలర్ బండారి శైలజ ఆగిరెడ్డి, కౌన్సిలర్లు మద్దెల శ్రీనివాస్, తళ్లపల్లి నర్సింలు, మాజీ ఉప సర్పంచ్ టేకులపల్లి శ్రీనివాస్ యాదవ్, సొసైటీ డైరెక్టర్ పాటి దామోదర్ రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
