116 ఏళ్ల వయసులోనూ… తిరుమలకు కాలినడకన భక్తి యాత్ర
తిరుమల, ఆంధ్రప్రభ: చిన్న వయస్సులోనే మోకాళ్ల నొప్పులంటూ.. కాళ్ల నొప్పులంటూ ఆసుపత్రుల వెంబడి తిరిగే ఈ రోజుల్లో.. 116 ఏళ్ల వయసులో ఓ వృద్ధురాలు భక్తినే ఊతకర్రగా చేసుకుని తిరుమల శ్రీవేంకటేశ్వరుడి దర్శనం కోసం కాలినడకన కొండెక్కింది. వయసు శరీరానికే పరిమితమని, మనసుకు కాదని ఆమె మరోసారి నిరూపించింది. ఈ అత్యంత భక్తిపూర్వక ఘట్టం శనివారం తిరుమలలో కనిపించింది. కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల వృద్ధురాలు శ్రీవేంకటేశ్వర స్వామిపై అపార భక్తితో, కుటుంబ సభ్యుల సహాయంతో అలిపిరి మెట్ల మార్గంలో కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. వృద్ధాప్యాన్ని లెక్కచేయకుండా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఆమె సాగిన భక్తి యాత్ర చూసిన తోటి భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆమె అడుగుల్లో కనిపించిన భక్తి, సంకల్పం పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. వృద్ధురాలు మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆమెతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపగా, ఆమె భక్తిని ప్రశంసిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వయసు ఎంత పెరిగినా భక్తికి హద్దులు ఉండవని ఈ అరుదైన సంఘటన మరోసారి చాటి చెప్పింది.
