మక్తల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్..
మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మండల పరిధిలోని గుడిగండ్ల గ్రామ సర్పంచ్ కె. శ్రీనివాస్ గౌడ్ నియమితులయ్యారు .మక్తల్ నియోజకవర్గ పరిధిలోని మక్తల్, మాగనూర్, కృష్ణ, నర్వ, ఊట్కూర్ మండలాలతో పాటు మక్తల్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులను పార్టీ అధిష్టానం ప్రకటించింది .మక్తల్ పట్టణ అధ్యక్షుడిగా బోయ రవికుమార్ ను కొనసాగిస్తూ మరోసారి అవకాశం కల్పించారు. నర్వ మండల అధ్యక్షుడిగా బీసం చెన్నయ్య సాగర్ ను మరోసారి కొనసాగిస్తూ అవకాశం కల్పించారు.
ఊట్కూర్ మండల అధ్యక్షుడిగా మాజీ జెడ్పిటిసి సూర్య ప్రకాష్ రెడ్డి, మాగనూరు మండల అధ్యక్షుడిగా పారేవుల శివరాంరెడ్డి, కృష్ణా మండల అధ్యక్షుడిగా మాలిపటేల్ విజయ్ గౌడ్ లను నియమించగా మక్తల్ మండల అధ్యక్షుడిగా శ్రీనివాస్ గౌడ్ ను నియమించారు. మక్తల్ మండల అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం గుడిగండ్ల గ్రామ సర్పంచ్ గా కొనసాగుతుండగా గతంలో ఎంపీటీసీ సభ్యుడిగా పని చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రభ ప్రతినిధితో మాట్లాడుతూ.. తనను మక్తల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ ఉత్తర్వులు జారీచేసింది అన్నారు.
తన నియామకానికి సహకరించిన స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు పాటుపడతానని చెప్పారు. తన నియామకానికి సహకరించిన మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక నాయకులకు శ్రీనివాస్ గౌడ్ మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.
