Political Journey | రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

Political Journey | రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

జెడ్పీటీసీ టూ సీఎం
స్వతంత్ర అభ్యర్థిగా తొలి విజయం..
రాష్ట్ర అత్యున్నత పదవికి చేరిన అరుదైన ప్రయాణం
పాలమూరు నేల నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు..
ఎన్నో మలుపులు, మరెన్నో పోరాటాలతో సాగిన రాజకీయ జీవితం

Political Journey | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజా జీవితంలో రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్నారు. గ్రామీణ స్థాయి ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన ఆయన రాజకీయ ప్రస్థానం రాష్ట్ర అత్యున్నత పదవైన ముఖ్యమంత్రి స్థాయికి చేరడం విశేషం. స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీ సభ్యుడిగా తొలి విజయం సాధించిన రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, చివరకు ముఖ్యమంత్రి వరకు ఎదిగారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ (పాలమూరు) జిల్లా నుంచి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన రెండో నాయకుడిగా చరిత్రలో నిలిచారు.

స్వతంత్ర అభ్యర్థిగానే రాజకీయ అరంగేట్రం
విద్యార్థి దశలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) కార్యకర్తగా పనిచేసిన రేవంత్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో మాత్రం స్వతంత్ర అభ్యర్థిగానే అడుగుపెట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మిడ్జిల్‌ మండల జెడ్పీటీసీ స్థానానికి 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి జూలై 4, 2006న విజయం సాధించారు. అదే ఆయన ప్రజాప్రతినిధిగా తొలి విజయంగా నిలిచింది.

ఎమ్మెల్సీగా శాసనసభ్య జీవితానికి శ్రీకారం
జెడ్పీటీసీ విజయానంతరం ఏడాదిలోనే 2007లో మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో తొలిసారిగా శాసన మండలిలో అడుగుపెట్టి రాష్ట్రస్థాయి రాజకీయాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

టీడీపీలో ఎదుగుదల.. రెండుసార్లు ఎమ్మెల్యే
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన రేవంత్‌రెడ్డి తన వాగ్దాటి, దూకుడు, రాజకీయ చాతుర్యంతో పార్టీ ముఖ్య నాయకుడిగా ఎదిగారు. 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్‌ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. అసెంబ్లీలో టీడీపీ బలహీనపడటం, పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో 2017లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

కాంగ్రెస్‌లో వేగంగా ఎదుగుదల
కాంగ్రెస్‌లో చేరిన కొద్ది కాలానికే రేవంత్‌రెడ్డి ప్రజల్లో మంచి ఆదరణ పొందారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయనను తెలంగాణ కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో కొడంగల్‌ నుంచి పోటీ చేసిన ఆయన బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ పరాజయం ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా మారింది.

ఎంపీగా ఢిల్లీకి.. పీసీసీ చీఫ్‌గా రాష్ట్రానికి
2019 లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్‌రెడ్డి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. అనంతరం పార్టీ బలోపేతం కోసం చేసిన కృషిని గుర్తించిన కాంగ్రెస్‌ అధిష్ఠానం 2021 జూలై 7న ఆయనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించింది.

కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన నాయకుడు
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పార్టీని పునర్వ్యవస్థీకరించి ప్రజల్లోకి తీసుకెళ్లారు. పాదయాత్రలు, ప్రజా సమస్యలపై ఉద్యమాలు, ప్రభుత్వంపై నిరంతర పోరాటంతో కాంగ్రెస్‌కు కొత్త ఊపు తీసుకొచ్చారు. దాని ఫలితంగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించింది.

ముఖ్యమంత్రి పీఠం వరకు విజయ ప్రస్థానం
2023 డిసెంబర్‌ 7న తెలంగాణ రెండో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రారంభమైన రాజకీయ జీవితం ముఖ్యమంత్రి పదవికి చేరుకోవడం ఆయన ప్రజా జీవితంలో అత్యంత కీలక ఘట్టంగా నిలిచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా సాధించిన తొలి విజయంతో ప్రారంభమైన రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం.. ఇరవై ఏళ్లలో తెలంగాణ ముఖ్యమంత్రి పీఠం వరకు చేరుకోవడం ఆయన రాజకీయ పట్టుదల, అవకాశాలను అందిపుచ్చుకునే నాయకత్వానికి నిదర్శనంగా నిలిచిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రేవంత్‌రెడ్డి రాజకీయ ప్రస్థానం

2006 – జెడ్పీటీసీ సభ్యుడు (ZPTC)
మహబూబ్‌నగర్ జిల్లా (ప్రస్తుత నాగర్‌కర్నూల్ జిల్లా) పరిధిలో జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారు.
స్థానిక సమస్యలపై పోరాడుతూ ప్రజల్లో గుర్తింపు పొందారు.

2007 – ఎమ్మెల్సీ
ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
రాష్ట్ర రాజకీయాల్లో చురుకైన నాయకుడిగా ఎదిగారు.

2009 – ఎమ్మెల్యే
కొడంగల్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
అనంతరం 2014లో కూడా అదే నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొందారు.

2019 – ఎంపీ
కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు కీలక నాయకుడిగా ఎదిగారు.

2021 – తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా (టీపీసీసీ చీఫ్) బాధ్యతలు స్వీకరించారు.
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు, సభలు నిర్వహించారు.

2023 – తెలంగాణ ముఖ్యమంత్రి
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు.
కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, 2023 డిసెంబర్ 7న తెలంగాణ రెండో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి ఎమోష‌న‌ల్ ట్వీట్‌

సీఎం రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని తరగని మధుర జ్ఞాపకం అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. 2006లో మిడ్జిల్‌లో మొదలై నేడు ప్రజల గుండెల్లో రేవంతన్నగా నిలిచిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానం ప్రత్యేక అధ్యాయమని పేర్కొన్నారు.

లక్షల అక్షరాలతో రాసినా…
కోట్ల పదాలను కూర్చి చెప్పినా…
తరగని మధుర జ్ఞాపకం…
ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం.

నాడు మిడ్జిల్ లో రేవంత్ రెడ్డిగా మొదలై…
నేడు మీ అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం నా జీవితంలో ప్రత్యేక అధ్యాయం.

ఈ 20 ఏళ్లలో ప్రతి సందర్భంలో, ప్రతి సంఘటనలో, ప్రతి సంఘర్షణలో, ప్రజల కోసం నేను చేసిన ప్రతి పోరాటంలో నాతో నిలిచిన, నాతో నడిచిన ప్రతి ఆత్మీయుడికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, రాజకీయ కార్యకర్తలకు హృదయపూర్వక అభినందనలు.

ఇదే స్ఫూర్తితో,
ప్రజలకు మరింత సేవ చేయాలన్న ఆర్తితో,
మీ అందరి ఆశీర్వాద బలంతో
భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా…
అన్నింటికీ మించి రేవంతన్నగా…
మీ హృదయాల్లో నా స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంటానని మాట ఇస్తున్నాను
.