ఉప్లూర్కు బైపాస్ బీటీ రోడ్డు మంజూరు..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం ఉప్లూర్ గ్రామ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గ్రామానికి రూ.5 కోట్ల 17 లక్షల వ్యయంతో బైపాస్ బీటీ రోడ్డు మంజూరు కావడంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ శనివారం ప్రెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, బైపాస్ రోడ్డు నిర్మాణంతో గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు గ్రామ అభివృద్ధికి కొత్త ఊపు లభిస్తుందని తెలిపారు. ఈ రోడ్డు మంజూరుకు సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ మెంబర్ బాస వేణుగోపాల్ యాదవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ అధ్యక్షతన పంచాయతీ వర్గం సమావేశమై గ్రామ రహదారుల కోసం ప్రతిపాదనలు రూపొందించి, వాటిని వేణుగోపాల్ యాదవ్, సునీల్ రెడ్డి లకు అందజేసినట్లు తెలిపారు. వారి స్పందనతో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్, గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, జిల్లా నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, కొమ్ముల రవీందర్, సుంకరి విజయ్, వార్డ్ సభ్యులు రాకేష్, సాధుల్లా, నాయకులు తక్కురి శేఖర్, క్రాంతి రెడ్డి, తిరుమలేష్, రాజేశ్వర్, నాజీర్, పురుషోత్తం, మొకిమ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
