సామాన్యుడి త‌గ్గ‌ని పెట్రోల్ మంట..!

  • క్రూడ్ ధరలు భారీగా తగ్గినా.. దేశంలో తగ్గని ఇంధన ధరలు
  • శ్రీలంకలో తగ్గింపు.. నయారా కూడా రేట్లు తగ్గించింది..
  • ప్రభుత్వ కంపెనీల మౌనం

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు గణనీయంగా తగ్గాయి. చమురు ధరలు దాదాపు 40 శాతం వరకు పడిపోయాయి. దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం యథాతథంగానే కొనసాగుతున్నాయి. పైగా ఇప్పట్లో ఇంధన ధరలను తగ్గించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో సామాన్యులకు నిరాశ ఎదురైంది. అంతర్జాతీయంగా చమురు చౌకైనా.. బంకుల వద్ద మాత్రం అదే పాత ధరలు కొనసాగుతుండటంతో వినియోగదారులపై ఇంధన భారం తగ్గడం లేదు.

అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలతో గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు భారీగా పెరిగాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. అయితే తాజాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. అన‌తంరం మధ్యప్రాచ్యంలోని కీలక సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధిలో రవాణా సాధారణ స్థితికి చేరుకుంది.

దీంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఒక దశలో బ్యారెల్‌కు 120 డాలర్లకు పైగా చేరిన బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం 70-72 డాలర్ల మధ్యకు పడిపోయింది. అలాగే వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ ధర కూడా 68 డాలర్ల వద్ద కొనసాగుతోంది. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు కూడా గణనీయంగా పెరగడంతో సరఫరాపై ఉన్న ఆందోళనలు తగ్గాయి.

భారత్ తన అవసరాల్లో 85 శాతానికి పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. అందువల్ల అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గితే దేశానికి దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో పాటు కంపెనీల లాభదాయకత పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు తగ్గడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. విమానయాన, లాజిస్టిక్స్ వంటి ఇంధన ఆధారిత రంగాలకు కూడా ఇది ఊరటనిస్తుంది.

అయితే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల్లో మాత్రం ఇప్పటివరకు ఎలాంటి తగ్గింపు కనిపించలేదు. దీంతో సామాన్య వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పొరుగు దేశమైన శ్రీలంక అంతర్జాతీయ ధరల తగ్గుదలకు అనుగుణంగా పెట్రోల్ ధరలను తగ్గించింది. దేశీయంగా కూడా ప్రైవేట్ ఇంధన సంస్థ నయారా ఎనర్జీ సంస్థ‌ పెట్రోల్ ధరలను తగ్గించే నిర్ణయం తీసుకుంది. దాదాపు రూ.5 మేర త‌గ్గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది.

కానీ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు మాత్రం ధరల్లో మార్పు చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం ఇప్పటికిప్పుడు తగ్గే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు తగ్గిన వెంటనే పంపుల వద్ద ధరలు తగ్గవని ఆయన తెలిపారు.

ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్తాన్ పెట్రోలియం (HPCL) కలిసి గత కొంతకాలంలో పెట్రోల్, డీజిల్, సబ్సిడీ వంట గ్యాస్ విక్రయాలపై భారీగా నష్టాలను ఎదుర్కొన్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. గ్లోబల్ ధరల పెరుగుదల సమయంలో మొత్తం భారాన్ని వినియోగదారులపై వేయకుండా కంపెనీలు భరించడంతో సుమారు రూ. 74,781 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు.

అందుకే ఇప్పటికిప్పుడు ధరలు తగ్గించడం సులభం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న ధరలు కొనసాగితేనే రిటైల్ ధరల తగ్గింపు అవకాశాన్ని పరిశీలించగలమని మంత్రి తెలిపారు. అంటే అంతర్జాతీయ ధరలు స్థిరంగా ఉండటం కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

వెంటనే తగ్గేది కాదు.. కారణం ఇదే

ప్రస్తుతం పెట్రోల్ బంకుల‌ వద్ద అమ్ముతున్న ఇంధనం దాదాపు రెండు నుంచి రెండున్నర నెలల క్రితం అధిక ధరలకు కొనుగోలు చేసిన క్రూడ్ తో తయారవుతోంది. అప్పట్లో మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కార‌ణంగా క్రూడ్ ఆయిల్ ధరలు 110 డాలర్లకు పైగా ఉండగా, బీమా, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. అందువల్ల వెంటనే ధరలు తగ్గించే అవకాశం లేదని కేంద్ర‌ ప్ర‌భుత్వం చెబుతుంది.

ప్రస్తుతం తగ్గిన ధరలకు కొనుగోలు చేస్తున్న క్రూడ్ భారత రిఫైనరీలకు చేరుకుని, అక్కడి నుంచి పెట్రోల్, డీజిల్‌గా మారి మార్కెట్‌లోకి రావడానికి మరికొంత సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ పరిస్థితులు స్థిరంగా కొనసాగి, క్రూడ్ ధరలు ఇదే స్థాయిలో ఉంటే రానున్న వారాల్లో దేశీయ ఇంధన ధరలపై ప్రభావం కనిపించే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

విమానయాన రంగానికి మాత్రం ఊరట

ఇదిలా ఉంటే, క్రూడ్ ధరల తగ్గుదల విమానయాన రంగానికి మాత్రం ఊరట కలిగిస్తోంది. విమాన ఇంధనం (ATF) ఎయిర్‌లైన్స్ ఆపరేటింగ్ ఖర్చుల్లో దాదాపు మూడో వంతు భాగాన్ని కలిగి ఉండటంతో ధరల తగ్గుదల లాభదాయకంగా మారుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశీయ విమానయాన సంస్థలకు విమాన ఇంధన ధరను లీటరుకు సుమారు రూ.5 తగ్గించింది. దీంతో ఢిల్లీలో ATF ధర లీటరుకు సుమారు రూ.110కి చేరింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల తర్వాత తొలిసారి జరిగిన ఈ తగ్గింపు ఎయిర్‌లైన్స్‌కు కొంత ఉపశమనం ఇచ్చింది.

క్రూడ్ ధరలు తగ్గిన ప్రభావం మొదటగా విమానయాన రంగంలో కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా అంతర్జాతీయ మార్గాల్లో ఇంధన సర్‌చార్జ్‌లను తగ్గించినట్లు ట్రావెల్ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా రూట్లలో సర్‌చార్జ్ $280 నుంచి $200కి తగ్గగా, యూకే, యూరప్ మార్గాల్లో $205 నుంచి $125కి తగ్గినట్లు సమాచారం. అయితే ఈ మార్పుపై ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. అదేవిధంగా, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా అంతరాయం చెందిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సేవలు మళ్లీ సాధారణ స్థితికి వస్తున్నాయి. ఒమాన్‌లోని సలాలా, కువైట్ మార్గాల్లో విమాన సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి.

వంటింటిపై కొన‌సాగుతున్న‌ భారం…

క్రూడ్ ధరల తగ్గుదలతో వంటింటి ఖర్చులపై కూడా కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్యాటరింగ్ సేవలు వంటి వాణిజ్య వినియోగదారులకు ఇది లాభదాయకంగా మారనుంది. జులై 1 నుంచి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ LPG సిలిండర్ ధరను రూ.183.50 తగ్గించి ఢిల్లీలో రూ.2,930కు చేర్చాయి. అలాగే 5 కిలోల ఫ్రీ ట్రేడ్ LPG ధరను రూ.13 తగ్గించి రూ.808.50కి తగ్గించారు.

ఈ తగ్గింపు వల్ల వ్యాపారాల నిర్వహణ ఖర్చులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. ఆ ప్రయోజనం వినియోగదారులకు చేరుతుందా లేదా అనేది పోటీ, వ్యాపారుల ధరల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో LPG ధరలు జనవరిలో రూ.111, ఏప్రిల్‌లో రూ.195.50 పెరగగా.. ఇప్పుడు తొలిసారిగా తగ్గుదల నమోదైంది.

అయితే, రెస్టారెంట్లు, హోటళ్లు వంటి వాణిజ్య రంగాలకు తగ్గుదల ప్రభావం కనిపిస్తున్నప్పటికీ గృహ వినియోగదారులకు మాత్రం వెంటనే ఉపశమనం లభించే పరిస్థితి లేదు. జూన్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ LPG సిలిండర్ ధర రూ.29 పెరిగి ఢిల్లీలో రూ.942కు చేరింది. అంతకుముందు మార్చిలో రూ.60 పెంపు జరిగిన సంగతి తెలిసిందే.

క్రూడ్ ధరల తగ్గుదలతో భవిష్యత్తులో వంటింటి ఖర్చులు కొంత తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంటనూనె ధరలు దిగుమతులు స్థిరపడటం, రవాణా ఖర్చులు తగ్గడం వల్ల తగ్గే అవకాశముంది. అలాగే ప్యాకేజింగ్ మెటీరియల్స్, ఫ్రైట్, లాజిస్టిక్స్, దిగుమతి ముడి పదార్థాల ఖర్చులు తగ్గడం వల్ల FMCG కంపెనీలపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో వ్యాపార సంస్థలు ధరలు పెంచే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని, ప్యాకెట్ పరిమాణాలు తగ్గించడం లేదా ధరలు పెంచే పరిస్థితులు కొంతవరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అయితే వినియోగదారులు వెంటనే తక్కువ ధరలను చూడకపోవచ్చని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంధనం ఖర్చులో ఒక భాగం మాత్రమే కావడంతో మొత్తం ధరల్లో తగ్గుదల రావడానికి సమయం పడుతుందని వారు అంటున్నారు. రాబోయే నెలల్లో ఇతర ఇన్‌పుట్ ఖర్చులు, ముడి పదార్థాల ధరలు ఎలా మారుతాయన్నదానిపై ప్రభావం ఆధారపడి ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

రూపాయి రికవరీ…

గత కొన్ని నెలలుగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతల సమయంలో క్రూడ్ ధరలు పెరగడంతో రూపాయి విలువ క్షీణించి డాలర్‌కు సుమారు 96.9 స్థాయికి పడిపోయింది. అయితే ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గడంతో పాటు హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకల రవాణా సాధారణ స్థితికి రావడంతో క్రూడ్ ధరలు తగ్గాయి. దీని ప్రభావంతో రూపాయి తిరిగి కొంత బలం పుంజుకుని ప్రస్తుతం 95–96 పరిధిలో కదలాడుతోంది. దిగుమతి బిల్లు తగ్గడం రూపాయి స్థిరీకరణకు దోహదపడుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

రూపాయి బలపడటం కేవలం కరెన్సీ మార్కెట్‌కే పరిమితం కాకుండా విస్తృత ఆర్థిక ప్రయోజనాలు ఇస్తుందని నిపుణులు అంటున్నారు. దేశం కరెంట్ అకౌంట్ లోటు తగ్గడంతో పాటు విదేశీ ఆర్థిక స్థితి బలపడుతుంది. దిగుమతుల ఖర్చు తగ్గుతుంది. రూపాయి మరింత స్థిరపడితే విదేశీ విద్య, విదేశీ ప్రయాణాలు, దిగుమతి ముడి పదార్థాలు, వస్తువుల ఖర్చులు కూడా కొంత తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

షేర్ మార్కెట్‌కు ఊరట..

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడంతో దేశీయ స్టాక్ మార్కెట్లకు కూడా ఊరట లభిస్తోంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల సమయంలో క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో ద్రవ్యోల్బణం, ఉత్పత్తి వ్యయాలు పెరుగుతాయనే ఆందోళనలతో పెట్టుబడిదారులు భారీగా అమ్మకాలకు దిగారు. దీంతో ఒక దశలో మార్చి ప్రారంభంలో 80 వేల పాయింట్లకు చేరువలో ఉన్న బీఎస్‌ఈ సెన్సెక్స్.. ఏప్రిల్‌లో 71,546 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అయితే పరిస్థితులు చక్కబడటంతో పాటు క్రూడ్ ధరలు తగ్గుముఖం పట్టడంతో మార్కెట్లలో మళ్లీ కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం సెన్సెక్స్ సుమారు 77,500 పాయింట్ల వద్ద ట్రేడవుతూ దాదాపు 6 వేల పాయింట్లకు పైగా కోలుకుంది.

రూపాయిపై ఒక్క క్రూడ్ ప్రభావమే కాదు

అయితే రూపాయి విలువపై కేవలం క్రూడ్ ఆయిల్ ధరలే ప్రభావం చూపవని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. దిగుమతిదారుల డాలర్ డిమాండ్, విదేశీ పెట్టుబడిదారుల పెట్టుబడులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విధానం, అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు కూడా రూపాయి మారక విలువను ప్రభావితం చేస్తాయి. ఇటీవల క్రూడ్ ధరలు తగ్గడంతో రూపాయి బలపడినప్పటికీ, దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ పెరగడంతో ఆ లాభాల్లో కొంత కోల్పోయినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

మధ్యప్రాచ్య సంక్షోభానికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా.. దాని ప్రభావం సామాన్య ప్ర‌జ‌ల‌పైనా ప‌డుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు గణనీయంగా తగ్గినా, దేశీయంగా ఇంధన ధరలు ఇంకా యథాతథంగా కొనసాగుతుండటంతో వినియోగదారులకు ఊరట దక్కడం లేదు. అంతర్జాతీయ పరిస్థితులు మరింత స్థిరపడితే, ఆ ప్రయోజనం త్వరలోనే దేశీయ ఇంధన ధరల్లోనూ ప్రతిబింబించాలని సామాన్యులు ఆశిస్తున్నారు. ప్ర‌స్తుతం అంతర్జాతీయంగా చమురు చౌకైనప్పటికీ.. పంపుల వద్ద మాత్రం అదే పాత ధరలు కొనసాగుతుండటంతో సామాన్యుడిపై ఇంధన భారం ఇప్పటికైతే తగ్గే సూచనలు కనిపించడం లేదు.