పవన్ కళ్యాణ్ ప్రయోగం విజయవంతం:
మంత్రి కందుల దుర్గేష్
నిర్మాణ సారథుల కమిటీ కోసం కార్యకర్తల నుంచి విశేష స్పందన
భవానీపురం, ఆంధ్రప్రభ: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని, ఈ ప్రయోగం విజయవంతమైందని విజయవాడ జనసేన పార్టీ పార్లమెంటరీ ఇన్‌చార్జి, మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పశ్చిమ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకుడు, ఆంధ్ర సెంట్రల్ జోన్ కన్వీనర్ బాడిత శంకర్ ఆధ్వర్యంలో కార్యకర్తలు, నాయకులు, వీర మహిళలు భారీ ర్యాలీగా మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయానికి చేరుకుని సభ్యత్వ దరఖాస్తును సమర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా పరిశీలకులను నియమించి ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 30 నుంచి 32 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.
బాడిత శంకర్ పెద్ద ఎత్తున కార్యకర్తలతో పండుగ వాతావరణంలో వచ్చి దరఖాస్తు సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. అందిన దరఖాస్తులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పరిశీలించి, అర్హులకు తగిన బాధ్యతలు అప్పగిస్తూ కమిటీలను ఏర్పాటు చేస్తారని తెలిపారు. కార్యకర్తల నుంచి లభిస్తున్న విశేష స్పందనను బట్టి పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు.
