సిమెంట్ కంపెనీలకు ఆర్డీఎఫ్ వినియోగం తప్పనిసరి….

ఎస్‌బీఎం నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
ఇంధన అవసరాల్లో కనీసం 6 శాతం ఆర్డీఎఫ్ వినియోగించాలి
వినియోగంపై ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు..
నిబంధనలు పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తప్పవు
స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్…

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్‌బీఎం) తాజా నిబంధనల మేరకు రాష్ట్రంలోని సిమెంట్ కంపెనీలు తమ ఇంధన అవసరాల్లో కనీసం ఆరు శాతం రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ (ఆర్డీఎఫ్)ను తప్పనిసరిగా వినియోగించాలని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. ఆర్డీఎఫ్ వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడ గురునానక్ కాలనీలోని ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) కార్యాలయం ‘పర్యావరణ్ భవన్’లో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ, 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన స్వచ్ఛ భారత్ మిషన్ తాజా నిబంధనల ప్రకారం ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ కేంద్రాలు, బయోమైనింగ్ ద్వారా ఉత్పత్తయ్యే లెగసీ వేస్ట్ నుంచి తయారయ్యే రిఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ (ఆర్డీఎఫ్)ను సిమెంట్ కంపెనీలు తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు.ప్రతి సిమెంట్ కంపెనీ తమ ఇంధన అవసరాల్లో కనీసం ఆరు శాతం ఆర్డీఎఫ్ వినియోగించడంతో పాటు, అందుకు అవసరమైన రిట్రోఫిటింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.

ఆర్డీఎఫ్ వినియోగానికి సంబంధించి ప్రతి సంస్థ స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక (టైమ్‌లైన్)ను సమర్పించాలని ఆదేశించారు. సిమెంట్ కంపెనీలు ఎంత మేర ఆర్డీఎఫ్ వినియోగిస్తున్నాయో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సంయుక్తంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎస్‌బీఎం నిబంధనలను పాటించని కంపెనీలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ డాక్టర్ పి. కృష్ణయ్య హెచ్చరించారు. సమావేశంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండీ బి. అనిల్ కుమార్ రెడ్డి, పీసీబీ సభ్యుడు ఆర్. శర్వణ, చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ ఎం. రాజశేఖర్‌తో పాటు గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.