బంగాళాఖాతంలో బ‌ల‌ప‌డుతున్న‌ అల్పపీడనం..

  • ఏపీకి భారీ వర్షాల హెచ్చరిక
  • మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు..
  • మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని సూచన

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని అల్పపీడనం ఏర్పడింది. ఇది రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో మరింత బలపడే అవకాశముందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల పాటు రెండు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, కొన్ని ప్రాంతాల్లో 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకర్ జైన్ తెలిపారు.

తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బలమైన గాలులు, ఎత్తైన అలలు ఏర్పడే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటిమునిగే పరిస్థితులు, రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విపత్తుల నిర్వహణ శాఖ విజ్ఞప్తి చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు ఇలా…

రాష్ట్రవ్యాప్తంగా ఏలూరు, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి, కోనసీమ, పోలవరం ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాల్లోనూ వాతావరణం చల్లగా ఉండటంతో పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణలోనూ భారీ వర్షాలు..

అల్పపీడనం ప్రభావం తెలంగాణపై కూడా కనిపించనుంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అలాగే కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.