ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి..

జాయింట్ కలెక్టర్ హరిసింగ్

క్షేత్రస్థాయిలో పరిశీలన.. ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలని బీఎల్‌వోలకు ఆదేశం

మోత్కూర్, ఆంధ్రప్రభ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) నమోదు ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా నిర్వహించాలని సూర్యాపేట జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) హరిసింగ్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలోని కొండగడప, పాటిమట్ల గ్రామాల్లో ఎస్‌ఐఆర్ నమోదు ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఎన్యుమరేషన్ ఫారాలను ఇంటింటికీ పంపిణీ చేయాలని, ఓటర్లకు ఫారాలు నింపే విధానంపై అవగాహన కల్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలు కూడా అవసరమైన పత్రాలతో బీఎల్‌వోలకు సహకరించి నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ హరిసింగ్ కోరారు.

ఈ కార్యక్రమంలో తహశీల్దార్ జ్యోతి, ఆర్‌ఐ సుమన్‌రెడ్డి, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.