రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే రాము
గుడివాడ, ఆంధ్రప్రభ: గత రాత్రి కురిసిన భారీ వర్షం నేపథ్యంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం ఉదయం పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు రైతు బజార్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు బజార్లో కూరగాయల విక్రయాలు, పారిశుధ్య పరిస్థితులు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించిన ఆయన రైతులు, సొసైటీల ప్రతినిధులు, వ్యాపారులు, కొనుగోలుదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు అందేలా రైతు బజార్లను మరింత అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో భారీ వర్షాలు కురిస్తే రైతు బజార్లో అడుగుల మేర నీరు నిలిచి కూరగాయలు నీటిలోనే ఉంచి విక్రయించాల్సి వచ్చేదని, అడుగుభాగంలో ఉన్న సరుకు పాడై తీవ్ర నష్టాలు చవిచూసేవాళ్లమని తెలిపారు. ప్రస్తుతం రైతు బజార్లో చేపట్టిన అభివృద్ధి పనుల కారణంగా ఎంత వర్షం కురిసినా నీరు నిల్వ ఉండడం లేదని, సౌకర్యవంతంగా వ్యాపారం చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్యేకు వివరించారు. కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు కూడా గతంతో పోలిస్తే రైతు బజార్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, మహిళలు, వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేసుకునే అవకాశం కలిగిందని హర్షం వ్యక్తం చేశారు.
వివిధ సొసైటీల ద్వారా స్టాల్స్ నిర్వహిస్తున్న వ్యాపారులతో ఎమ్మెల్యే మాట్లాడి రోజువారీ విక్రయాల పరిస్థితిని తెలుసుకున్నారు. రైతు బజార్‌కు వచ్చే ప్రతి వినియోగదారుడికి పరిశుభ్రమైన వాతావరణంలో నాణ్యమైన ఉత్పత్తులు అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డ్రైనేజీలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయడంతో పాటు ఎక్కడా నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తనిఖీల సందర్భంగా రైతు బజార్ ప్రధాన మార్గంలో కొందరు వ్యాపారులు చెత్త వేయడాన్ని గమనించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వారిని మందలించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్నపాటి నిర్లక్ష్యంతో రైతు బజార్‌ను మళ్లీ మురికి కూపంగా మార్చవద్దని సూచించారు. సమస్యలు ఏవైనా ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, తప్పకుండా పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. ఇకపై నిబంధనలు ఉల్లంఘించి రహదారులపై చెత్త వేయడం, ఆక్రమణలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే రైతు బజార్ ప్రధాన మార్గానికి ఇరువైపులా ఉన్న తోపుడుబళ్లను కూడా తొలగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గుడివాడ రైతు బజార్ అభివృద్ధి కూడా అందులో భాగమేనని చెప్పారు. గతంలో నిర్లక్ష్యంతో మురికికూపంలా మారిన రైతు బజార్‌ను ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్‌లు, మౌలిక వసతుల కల్పన ద్వారా పూర్తిగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. రైతు బజార్ అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ అని, ఇందులో రైతులు, వ్యాపారులు, ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరమని పేర్కొన్నారు.
ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించడం, ప్రతి వినియోగదారుడికి నాణ్యమైన కూరగాయలు అందడం, పరిశుభ్రమైన వాతావరణంలో కొనుగోళ్లు జరిగేలా చూడడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్పష్టం చేశారు.
