భార్యే యమదూతగా మారితే !!
- ఫస్ట్ అటెంప్ట్ ఫేయిల్… ఈసారి ఇలా ప్లాన్ !!
- అప్పులు ఎగ్గొట్టడానికి మాస్టర్ ప్లాన్…
- నిద్రలోనే భర్తను చంపాలని ప్లాన్..
- చివరికి ఇలా దొరికిపోయింది..!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమిళనాడులోని తంజావూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త చనిపోతే తీసుకున్న అప్పులు తీరిపోతాయని భావించిన ఓ మహిళ, నిద్రిపోతున్న భర్తను హత్య చేసేందుకు ప్రయత్నించింది. తన సోదరుడితో కలిసి… చెవిలో విషం పోసి ప్రాణాలు తీయాలని ప్రయత్నించింది. అయితే, బాధితుడు అప్రమత్తమవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
తిరువిడైమరుదూర్ తాలూకాలోని పుళిదికుడి గ్రామానికి చెందిన కూలీ రవీంద్రన్ (54), ఉమారాణి (48) దంపతులకు 27 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తుండగా, కుమార్తెకు వివాహమైంది. ఇటీవల కొత్త ఇల్లు నిర్మించేందుకు రవీంద్రన్ వివిధ బ్యాంకుల నుంచి రూ.10 లక్షల రుణం తీసుకున్నాడు. అప్పుల భారం నుంచి బయటపడాలంటే భర్తను చంపేయాలని ఉమారాణి పథకం వేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలో తన సోదరుడు జ్ఞానశేఖరన్తో కలిసి నిద్రిపోతున్న రవీంద్రన్ చెవిలో చిన్న సీసాతో విషం పోసేందుకు ప్రయత్నించింది. అయితే ఒక్కసారిగా మెలకువ వచ్చిన రవీంద్రన్, భార్యతో పాటు ఆమె సోదరుడిని చూసి అప్రమత్తమయ్యాడు. వారి నుంచి తప్పించుకుని స్థానికులకు విషయం చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
వైద్యులు సకాలంలో చికిత్స అందించడంతో రవీంద్రన్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అనంతరం బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టగా, మూడు నెలల క్రితమే టీలో విషం కలిపి హత్య చేసేందుకు కూడా ప్రయత్నించినట్లు రవీంద్రన్ వెల్లడించాడు. ఈ మేరకు ఉమారాణి, ఆమె సోదరుడు జ్ఞానశేఖరన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారగా, సామాజిక మాధ్యమాల్లో కూడా విస్తృతంగా చర్చనీయాంశమైంది. ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
