పశ్చిమ నియోజకవర్గం ది బెస్ట్..
- పశ్చిమలో టీడీపీ కంచుకోటను మరింత బలోపేతం చేయాలి
విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి పశ్చిమ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్య అతిథిగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పాల్గొని పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఎంపీ చిన్ని మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అన్ని భాగస్వామ్య పక్షాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లేకపోయినా, కూటమి అభ్యర్థి విజయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేశారని కొనియాడారు.
అధిష్ఠానం ఏ కార్యక్రమం చేపట్టినా, దానిని అత్యంత తక్కువ సమయంలో విజయవంతంగా అమలు చేసి చూపించే సామర్థ్యం పశ్చిమ నియోజకవర్గ నాయకత్వానికి ఉందని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తీర్చిదిద్దిన ఘనత ఇక్కడి నాయకులు, కార్యకర్తలదేనని అన్నారు.
తాను ఎంపీగా గెలవడంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ శ్రేణులు చేసిన కృషిని ఎప్పటికీ మరవలేనని చెప్పారు. ఎమ్మెల్యే స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ఎలాంటి విభేదాలకు తావులేకుండా పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడం పశ్చిమ నియోజకవర్గ ప్రత్యేకత అని ఎంపీ చిన్ని అభినందించారు.
ఈ నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు చేపట్టనున్న ‘సర్’ కార్యక్రమంతో పాటు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని, పార్టీ కార్యక్రమాలను సమిష్టిగా విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.
కష్టపడే కార్యకర్తలకు పదవులు
పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ప్రతి కార్యకర్తకు భవిష్యత్తులో పార్టీ పదవులు లభిస్తాయని ఎంపీ చిన్ని హామీ ఇచ్చారు. కోట్లాది సభ్యులు ఉన్న పార్టీ కావడంతో ఒకేసారి అందరికీ పదవులు ఇవ్వడం సాధ్యం కాదని, కార్యకర్తలు ఓర్పుతో పార్టీ బలోపేతానికి కృషి కొనసాగించాలని కోరారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి రాజు, జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి నాగుల్ మీరా, రాష్ట్ర అధికార ప్రతినిధులు డుండి రాకేష్, ఎంఎస్ బేగ్, రాష్ట్ర కార్యదర్శి ఆశా, రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి ఫతావుల్లా, జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు, 22 డివిజన్ల అధ్యక్షులు, కార్యదర్శులు, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జులు, బూత్ కన్వీనర్లు, సీనియర్ కార్యకర్తలు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు.
