జన్మదినం సందర్భంగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహం..

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం సుద్దాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మేకల రామస్వామి తన 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతిభావంతులైన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.

వి సర్వ్ సొసైటీ, బ్రెయిన్‌ఎక్స్ అకాడమీ ఆధ్వర్యంలో 2026 పదో తరగతి పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన కొల్లూరి రఘురామ్, చింతల హస్మిత, అక్కల పవిత్రలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున నగదు బహుమతిని అందించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, విద్యార్థులను ప్రోత్సహించేందుకు అందించిన ఈ నగదు బహుమతి వారి ఉన్నత విద్యకు తోడ్పడుతుందని అన్నారు. సేవాభావంతో విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుడు మేకల రామస్వామిని అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.