కార్యకర్తల కోసం వర్క్‌షాప్‌లు..
పార్టీ కార్యకలాపాలకు ప్రత్యేక వెబ్‌సైట్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ ప్రకటన
14 వేల గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేయడమే లక్ష్యం..
స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపు
తిరుపతి, ఆంధ్రప్రభ (రాయలసీమ బ్యూరో) : రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా కార్యకర్తల కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించనున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీ మాధవ్ ప్రకటించారు. పార్టీ కార్యకలాపాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను కూడా రూపొందించనున్నట్లు తెలిపారు.
తిరుపతిలో గురువారం జరిగిన బీజేపీ రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌చార్జిల సమావేశంలో ఆయన మాట్లాడారు. నూతన జిల్లా ఇన్‌చార్జిలకు బాధ్యతలపై ఆయన దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కమిటీల ఏర్పాటు వేగవంతం చేయనున్నట్లు చెప్పారు.
ఎస్ఐఆర్ సర్వేలో బూత్ లెవల్–1 పూర్తయిందని, లెవల్–2 కూడా త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. బూత్ స్థాయిలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. పార్టీ కార్యక్రమాలపై నిరంతర సమీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేంద్ర పార్టీ ఆలోచనలను గ్రామస్థాయికి తీసుకెళ్లాలని సూచించారు.
తెలంగాణ తరహాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని, అన్ని స్థానిక ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 14 వేల గ్రామాల్లో పార్టీ జెండా ఎగరేలా కృషి చేయాలని కోరారు.
ఇకపై కార్యకర్తల శిక్షణ కోసం ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహిస్తామని, పార్టీ కార్యక్రమాల సమన్వయం కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేస్తూ, అమరావతి, మూడు రాజధానులు, ‘మావిగాన్’ వంటి అంశాలపై గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి ప్రకటనలు వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ సమావేశంలో బీజేపీ జాతీయ సహ సంఘటన మంత్రి శివప్రకాశ్ జీ, పార్టీ నాయకులు సీఎం రమేష్, సోము వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
