తెలంగాణ ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం
- జూలై 15 వరకు అవకాశం
- అర్హులైన విద్యార్థులు వినియోగించుకోవాలి
- జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కుమారస్వామి
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి : విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మైనారిటీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఎం.ఎం. ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం కింద దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆసోడ కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం ద్వారా ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, సిక్కులు, జైనులు, పార్సీలు తదితర మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు విదేశీ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ (పీహెచ్‌డీ) కోర్సులు అభ్యసించేందుకు ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు పేర్కొన్నారు.
జూలై 15 వరకు దరఖాస్తులు
2026 జనవరి 1 నుంచి జూన్ 30 (స్ప్రింగ్ సీజన్–2026) మధ్య కాలంలో విదేశీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందిన అర్హులైన విద్యార్థులు జూలై 1 నుంచి జూలై 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అభ్యర్థులు తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం
అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి రూ.20 లక్షల వరకు లేదా కోర్సు వ్యయం ఎంత ఉంటే అంత మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుంది. అదనంగా వీసా, ప్రయాణ ఖర్చుల కోసం రూ.60 వేల వరకు ప్రత్యేక ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు వెల్లడించారు.
అర్హతలు, దరఖాస్తుల సమర్పణ
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత ధ్రువపత్రాల ప్రతులను జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి కార్యాలయం, కలెక్టరేట్ భవనం, సెంటర్-ఎస్-16, భూపాలపల్లిలో జూలై 31లోపు సమర్పించాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం 7337396427, 6302523278 నంబర్లను సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఆసోడ కుమారస్వామి తెలిపారు. విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే లక్ష్యంతో ఉన్న అర్హులైన మైనారిటీ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
