నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: ఎంవీఐ వంశీధర్
వేములవాడ, ఆంధ్రప్రభ: ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు చెందిన వాహనాలు ప్రభుత్వ నిబంధనల మేరకే నడపాలని, ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ వంశీధర్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గురువారం వేములవాడ మున్సిపల్ పరిధిలోని నాంపల్లి వద్ద వివిధ విద్యాసంస్థలకు చెందిన బస్సులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫిట్‌నెస్ లేకుండా నడుస్తున్న రెండు వాహనాలపై కేసులు నమోదు చేసి వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు.
విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యంగా స్కూల్ బస్సులపై నిత్యం తనిఖీలు నిర్వహిస్తామని ఎంవీఐ వంశీధర్ పేర్కొన్నారు. ప్రతి బస్సులో ఫైర్ సేఫ్టీ పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్, తాగునీటి సదుపాయం, ఎమర్జెన్సీ డోర్ తప్పనిసరిగా ఉండాలని, డ్రైవర్‌తో పాటు అటెండర్ కూడా ఉండాలని సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వైపర్లు, రివర్స్ హారన్, లైట్లు సక్రమంగా పనిచేసేలా చూడాలని, నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం సీజ్ చేసిన వాహనాలను వేములవాడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
