పని ఇప్పిస్తానని నమ్మించి..

  • బావిలోకి తోసేసిన దుండగుడు
  • 24 గంటలు బావిలోనే…
  • బంగారం దోచుకుని మహిళను బావిలోకి నెట్టాడు
  • తాళ్లు, మంచంతో మహిళను రక్షించిన గ్రామస్తులు

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పని ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళను తీసుకెళ్లిన దుండగుడు, ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు లాక్కొని బావిలోకి తోసేసినట్లు పోలీసులు తెలిపారు.

సుమారు 24 గంటల పాటు బావిలోనే ప్రాణాలతో పోరాడిన మహిళను గురువారం ఉదయం బావి యజమాని గుర్తించి స్థానికులకు, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే గ్రామస్తులు తాళ్లు, మంచం సహాయంతో మహిళను సురక్షితంగా బయటకు తీశారు.

బాధితురాలు కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన మహిళగా గుర్తించారు. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.