స్పందన కుటుంబానికి ఎమ్మెల్యే అండ..
నస్పూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణానికి చెందిన లగిశెట్టి శ్రీనివాస్ కుమార్తె స్పందన ఉన్నత విద్య (ఎంఎస్) అభ్యసించేందుకు అమెరికాలోని చికాగోకు వెళ్లింది. అక్కడ ప్రమాదవశాత్తు మెట్రో స్టేషన్‌లో కిందపడటంతో తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లింది. ప్రస్తుతం ఆమె అమెరికాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ విషయం తెలుసుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు వెంటనే స్పందించారు. స్పందన తల్లిదండ్రులు అమెరికాకు వెళ్లేందుకు అవసరమైన పాస్‌పోర్ట్, వీసా మంజూరు ప్రక్రియను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) అధికారులతో మాట్లాడి వేగవంతం చేయించారు. అలాగే విమాన టికెట్లు, ఇతర ప్రయాణ ఖర్చుల నిమిత్తం రూ.3 లక్షల ఆర్థిక సాయాన్ని స్పందన తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా స్పందన భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోలుకుని క్షేమంగా తిరిగి రావాలని ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఆకాంక్షించారు.
