vb-gram-ji-launch : ఊరూర.. ఉపాధి పండుగ Andhra Prabha News

vb-gram-ji-launch : ఊరూర.. ఉపాధి పండుగ Andhra Prabha News

  • వీబీజీ రామ్ జీ షురూ
  • రైల్వేకోడూరులో ప్రారంభించిన ఏపీ సీఎం
  • కేంద్ర మంత్రులు, డిప్యూటీ సీఎం హాజరు

( ఆధ్రప్రభ, తిరుపతి బ్యూరో )

దేశవ్యాప్తంగా గురువారం నుంచి అమలులోకి వచ్చిన ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (వీబీజీ-రామ్‌జీ)’ కార్యక్రమానికి తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామం వేదికగా నిలిచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంయుక్తంగా ఈ జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కార్యక్రమానికి ముందు సభా ప్రాంగణం సమీపంలో ముగ్గురు నేతలు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ మద్దతును తెలియజేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్లను పరిశీలించి వాటి పనితీరుపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నీటి సంరక్షణకు సంబంధించిన ఫోటో గ్యాలరీని సందర్శించి, గ్రామ పారిశుద్ధ్య నిర్వహణలో వినియోగిస్తున్న స్వచ్ఛ రథాలను పరిశీలించారు. కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులకు వీబీజీ-రామ్‌జీ జాబ్ కార్డులను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందజేశారు.

అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోత్సాహక గీతాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి కమలేష్ పాశ్వాన్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆవిష్కరించారు. అలాగే వీబీజీ-రామ్‌జీ పథకం సమాచార బుక్‌లెట్, కంపెండియం ఆఫ్ ఆర్టికల్స్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ పోర్టల్‌ను కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.