విద్యాంజలి హైస్కూల్‌లో జాతీయ వైద్యుల దినోత్సవ వేడుకలు

చిట్టినగర్, ఆంధ్రప్రభ : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ వించిపేటలోని శ్రీవిద్యాంజలి హైస్కూల్‌లో బుధవారం ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పలువురు వైద్యులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ కాన్వెంట్స్ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఒన్‌టౌన్–భవానీపురం డివిజన్ అధ్యక్షుడు గానుగుల యుగంధర ఆచార్య హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో దేవునితో పోల్చబడే వృత్తి వైద్య వృత్తి మాత్రమేనని అన్నారు. ప్రాణాలను కాపాడే బాధ్యతను నిర్వర్తించే వైద్యులు నిజంగా దేవుని ప్రతిరూపాలని పేర్కొన్నారు. వైద్య వృత్తి గొప్పదనాన్ని వివరించడంతో పాటు విద్యార్థుల్లో వైద్య రంగంపై ఆసక్తి, సేవాభావం పెంపొందేలా ప్రసంగించారు. ప్రిన్సిపాల్ పుప్పాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైద్యులు తమ వృత్తిపట్ల చూపుతున్న అంకితభావం సమాజానికి ఆదర్శమని కొనియాడారు. అనంతరం వివిధ ఆసుపత్రులకు చెందిన వైద్యులను ఘనంగా సత్కరించారు.

సత్కారం పొందిన వారిలో ప్రజా వైద్యశాలకు చెందిన డా. వి. శ్రవణ్ కుమార్, శ్రీ హోమియో క్లినిక్‌కు చెందిన డా. కె. రవిశంకర్, మీనాక్షి హాస్పిటల్స్‌కు చెందిన డా. కె. సాయి దీపక్, డా. కె. శ్రీగిరి, శాంతి క్లినిక్‌కు చెందిన డా. జి. శాంతకుమారి ఉన్నారు. సత్కార కార్యక్రమం అనంతరం డా. జి. శాంతకుమారి మాట్లాడుతూ.. వైద్య వృత్తిలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, చికిత్స పొందిన రోగులు వ్యక్తం చేసే కృతజ్ఞతే తమకు గొప్ప సంతృప్తినిస్తుందని అన్నారు.

విద్యార్థులు భవిష్యత్తులో వైద్య వృత్తిని ఎంచుకుని సమాజానికి సేవ చేయాలని, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ జ్యోత్స్నా, బి. నాగమణి, షాలిని, ఖమర్ జహాన్, సుధీర్ కుమార్, సునీత, శ్రీమన్ తదితరులు పాల్గొన్నారు.