ఎల్‌నినో ప్రభావం..

రైతులు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి

తక్కువ కాల పంటలు, సూక్ష్మ సేద్యం, ప్రత్యామ్నాయ సాగుతో నష్టాలు తగ్గించుకోవచ్చు: ఏడీఏ సత్యనారాయణ

ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో అనేది సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి మించి పెరగడం వల్ల ఏర్పడే వాతావరణ పరిస్థితి అని, దీని ప్రభావంతో వర్షపాతం తగ్గి వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని ఉరవకొండ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) సత్యనారాయణ తెలిపారు.

వర్షాభావ పరిస్థితులు వ్యవసాయ దిగుబడులతో పాటు పశుసంవర్థక రంగంపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

తక్కువ కాలంలో పండే, బెట్టను తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవాలని తెలిపారు. వరి పంటకు బదులుగా జొన్న, సజ్జ, రాగులు సాగు చేయడంతో పాటు వేరుశనగలో కదిరి–9, ధరణి వంటి రకాలను సాగు చేయాలని సూచించారు.

కంది పంటలో అంతర పంటలుగా కొర్ర, జొన్న, పెసర, అలసంద, గోరుచిక్కుడు విత్తనాలను విత్తన గుళికలుగా తయారు చేసి కంది సాళ్ల మధ్య విత్తుకుంటే, అవి 60 నుంచి 70 రోజుల్లోనే దిగుబడినిచ్చి రైతులకు అదనపు ఆదాయాన్ని అందిస్తాయని చెప్పారు.

శనగ సాగు చేసే పొలాలను అక్టోబర్ వరకు ఖాళీగా ఉంచకుండా జీలుగ, జనుము, పిల్లిపెసర, అలసంద, పెసర, కొర్ర వంటి పంటలను సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు.

బిందు, తుంపర్ల సేద్య పద్ధతుల ద్వారా సంప్రదాయ సాగుతో పోలిస్తే 40 నుంచి 60 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చని, అందువల్ల సూక్ష్మ సేద్య విధానాలను రైతులు విస్తృతంగా అనుసరించాలని కోరారు. అలాగే వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు ఫార్మ్ పాండ్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

రసం పీల్చే పురుగుల నివారణకు ఎకరానికి 20 చొప్పున పసుపు, నీలం జిగురు అట్టలు ఏర్పాటు చేయడంతో పాటు పొలం చుట్టూ రెండు నుంచి మూడు వరుసల్లో జొన్న లేదా సజ్జ వంటి రక్షక పంటలను సాగు చేయాలని తెలిపారు.

విత్తనాలను జీవన ఎరువులు, బయోపెస్టిసైడ్లతో శుద్ధి చేస్తే ప్రతికూల పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుందని చెప్పారు. బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 20 గ్రాముల యూరియా కలిపి పంటపై పిచికారీ చేయాలని సూచించారు.

వ్యవసాయ శాఖ సూచించిన రక్షణ చర్యలను రైతులు పాటిస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని నష్టాలను తగ్గించుకోవచ్చని ఏడీఏ సత్యనారాయణ తెలిపారు.