వీబీజీ రామ్‌ జీ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

రేపు ముక్కావారిపల్లిలో ఘనంగా ప్రారంభం
సీఎం చంద్రబాబుతో పాటు పలువురు హాజరు
25 వేల మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం
భద్రత, ట్రాఫిక్, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి

తిరుపతి, ఆంధ్రప్రభ : ఓబులవారిపల్లె మండలంలోని ముక్కావారిపల్లి పంచాయతీ వద్ద జూలై 2న నిర్వహించనున్న వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీజీ రామ్‌ జీ) పథకం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. జూలై 2వ తేదీ గురువారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు తదితరులు పాల్గొని పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

శాఖల మధ్య సమన్వయం అవసరం

కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్)ను నూతన మార్గదర్శకాలు, ఆధునిక విధానాలతో వీబీజీ రామ్‌ జీ పేరుతో అమలు చేయనున్న నేపథ్యంలో తిరుపతి జిల్లా యంత్రాంగం అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. తిరుపతి జిల్లా, రైల్వే కోడూరు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 25 వేల మందికి పైగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో శానిటేషన్, మరుగుదొడ్లు, తాగునీరు, భోజనం తదితర మౌలిక వసతులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వీవీఐపీ పర్యటన దృష్ట్యా భద్రత, బందోబస్తు, ప్రోటోకాల్ ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేశామని తెలిపారు. ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికను రూపొందించి, అవసరమైన చోట్ల డైవర్షన్ మార్గాలను ఖరారు చేసినట్లు వివరించారు.

ప్రత్యేక ఏర్పాట్లు

రాష్ట్రంలో గత రెండేళ్లుగా ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద చేపట్టిన ఉత్తమ కార్యక్రమాలను కేంద్ర ప్రతినిధులకు పరిచయం చేసేందుకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో మ్యాజిక్ డ్రైన్, ఫార్మ్ పాండ్, ప్లాంటేషన్ వంటి నమూనాలను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. వీబీజీ రామ్‌ జీ పథకం అమలుకు సంబంధించిన నూతన డిజిటల్ పోర్టల్‌ను కూడా ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారికంగా ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రజలు ట్రాఫిక్, భద్రతా సూచనలను పాటిస్తూ జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కలెక్టర్ కోరారు. కుడా చైర్మన్ రూపానంద రెడ్డి, తిరుపతి ఆర్డీవో రామ్మోహన్, డీపీఓ సుశీలాదేవి, ఎస్‌ఎస్‌జీ అధికారులు, సంబంధిత అధికారులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.