విద్యే ఉన్నత శిఖరాలకు మార్గం..

ప్రతి విద్యార్థి లక్ష్యసాధనకు కృషి చేయాలి

పి4 మార్గదర్శి–బంగారు కుటుంబం కార్యక్రమంలో విద్యా సామగ్రి పంపిణీ చేసిన ప్రభుత్వ సలహాదారుడు ఎం.ఏ. షరీఫ్

నర్సాపురం, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నాయని, ప్రతి విద్యార్థి విద్యావంతులై ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాసన మండలి మాజీ చైర్మన్, ప్రభుత్వ సలహాదారుడు ఎం.ఏ. షరీఫ్ ఆకాంక్షించారు.

నరసాపురం నియోజకవర్గంలోని నరసాపురం పట్టణం 21వ వార్డు పీచుపాలెం మున్సిపల్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం నిర్వహించిన పి4 మార్గదర్శి–బంగారు కుటుంబం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, స్టేషనరీ సామగ్రి, క్రీడా వస్తువులు తదితర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పి4 మార్గదర్శి–బంగారు కుటుంబం కార్యక్రమం ద్వారా దాతలు, సేవాభావం కలిగిన వ్యక్తులు ముందుకు వచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలకు చేయూత అందించడం అభినందనీయమన్నారు.

విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యే భవిష్యత్తుకు బలమైన పునాది అని, ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రభుత్వ పథకాలు, వసతులను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలని కోరారు. విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న పాఠశాల ఉపాధ్యాయులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొప్పాడి రవీంద్రనాథ్ ఠాగూర్, నియోజకవర్గ పి4 అధికారి నాగేశ్వరరావు, నరసాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు నాగిడి రాంబాబు, అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ నాట్ర నరేష్ కుమార్, మాజీ కౌన్సిలర్ బొమ్మిడి సూర్యకుమారి, నర్సాపురం మండల తెలుగు యువత అధ్యక్షుడు దొంగ మురళి, కొప్పాడి వెంకటరమణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.