ఉద్యమంలా బీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టాలి: బానోత్ శంకర్ నాయక్
కేసముద్రం, ఆంధ్రప్రభ: బీఆర్‌ఎస్ పార్టీ బలోపేతానికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమంలా నిర్వహించాలని మాజీ ఎమ్మెల్యే, మహబూబాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ బానోత్ శంకర్ నాయక్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం కేసముద్రం మండల కేంద్రంలో నిర్వహించిన ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వే) పార్టీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బూత్ పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరిని పార్టీ సభ్యత్వంలో చేర్చేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేసేందుకు బీఎల్‌ఏలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు నమోదులో భాగస్వాములు అయ్యేలా కృషి చేయాలని కోరారు. అలాగే సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కార్యక్రమాల్లో మహబూబాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా నిలిపేలా ప్రతి నాయకుడు, కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
బూత్ కన్వీనర్లు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు, గ్రామ సర్పంచులు, సర్పంచ్ అభ్యర్థులు, సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సహకార సంఘాల డైరెక్టర్లు, వార్డు సభ్యులతో సమన్వయం చేసుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రవిచంద్రారెడ్డి, మాజీ జడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, మాజీ ప్రెసిడెంట్లు నజీర్ అహ్మద్, మాజీ ప్రధాన కార్యదర్శి కముటం శ్రీనివాస్, ఊకంటి యాకూబ్‌రెడ్డి, గూగులోత్ వీరునాయక్‌తో పాటు పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, బీఎల్‌ఏలు, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జిలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
