తోతాపురి రైతులకు కేంద్రం తీపి కబురు..
మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకానికి గ్రీన్‌సిగ్నల్
2.16 లక్షల మెట్రిక్ టన్నుల మామిడికి ధర వ్యత్యాస చెల్లింపు.. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం భారం
చిత్తూరు, ఆంధ్రప్రభ: తోతాపురి మామిడి రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. 2026–27 మామిడి మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి మార్కెట్ ఇంటర్వెన్షన్ పథకం (ఎంఐఎస్) కింద ధర వ్యత్యాస చెల్లింపు అమలుకు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ అధికారికంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు జూలై 1న రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలో ఈ సీజన్‌లో అంచనా వేసిన 8.65 లక్షల మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడి ఉత్పత్తిలో 25 శాతం, అంటే 2,16,250 మెట్రిక్ టన్నుల వరకు ఈ పథకం వర్తించనుంది. రైతులకు కనీస ఆదాయం లభించేలా క్వింటాల్‌కు రూ.1,747 మార్కెట్ ఇంటర్వెన్షన్ ధర (ఎంఐపీ)ను నిర్ణయించింది.
మామిడి విక్రయ ధరను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ నిర్ణయించనుంది. వ్యవసాయ, ఉద్యాన, సహకార శాఖల ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఈ కమిటీ పనిచేస్తుంది. మార్కెట్ ఇంటర్వెన్షన్ ధరకు, రైతు పొందిన విక్రయ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసంలో గరిష్ఠంగా ఎంఐపీ విలువలో 25 శాతం వరకు రైతులకు ధర వ్యత్యాసాన్ని చెల్లించనున్నారు.
ఈ పథకం ప్రయోజనం పొందాలంటే రైతులు తమ తోతాపురి మామిడిని రాష్ట్రంలోని నోటిఫై చేసిన వ్యవసాయ మార్కెట్ యార్డులు (ఏపీఎంసీ మండీలు) ద్వారానే విక్రయించాల్సి ఉంటుంది. ఉత్తర్వులు జారీ అయిన తర్వాత తొలి లావాదేవీ నుంచి ఒక నెలపాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.
ధర వ్యత్యాస చెల్లింపుల వల్ల వచ్చే ఆర్థిక భారాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో 50 శాతం చొప్పున భరిస్తాయి. ధరల నిర్ణయానికి రాష్ట్ర పోర్టల్‌లో నమోదయ్యే మార్కెట్ ధరలనే ప్రామాణికంగా తీసుకుంటారు. రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా విడుదల చేసి, అనంతరం కేంద్రానికి లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది. కేంద్రం పరిశీలన అనంతరం తన వాటాను రాష్ట్రానికి తిరిగి చెల్లించనుంది.
రైతులకు చెల్లింపులు ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాల ద్వారా నేరుగా డీబీటీ విధానంలో జమ చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అలాగే ప్రతిరోజూ మార్కెట్‌కు వచ్చిన మామిడి పరిమాణం, మోడల్ ధర వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర వ్యవసాయ శాఖకు పంపాల్సి ఉంటుంది. పథకం అమలు పూర్తయిన తర్వాత పూర్తి లెక్కలు, సంబంధిత పత్రాలు సమర్పించిన అనంతరం మాత్రమే కేంద్ర ప్రభుత్వం తన వాటాను విడుదల చేయనుంది.
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని వేలాది తోతాపురి మామిడి రైతులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. ఇటీవల మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పడిపోవడంతో నష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఈ పథకం ద్వారా కొంత మేర ఆర్థిక ఉపశమనం లభించనుందని ఉద్యానవన శాఖ వర్గాలు భావిస్తున్నాయి.
