సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటు: గవర్నర్ అబ్దుల్ నజీర్

విలువలతో కూడిన విద్యతో మంచి పౌరులుగా ఎదగాలి.. పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని పట్టభద్రులకు పిలుపు

అనంతపురం, ఆంధ్రప్రభ: రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేశారని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. బుధవారం జంతలూరులోని ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం విశ్వవిద్యాలయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మైలురాయని గవర్నర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఫలితంగానే ఈ విశ్వవిద్యాలయం ఆవిర్భవించిందని తెలిపారు.

2018లో స్థాపించబడిన ఈ విశ్వవిద్యాలయం రాయలసీమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిందన్నారు. శ్రీకృష్ణదేవరాయల పాలనలో వెలుగొందిన విజయనగర సామ్రాజ్య వారసత్వంతో పాటు ఖనిజ సంపద, పట్టు పరిశ్రమ, ఉద్యాన పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం రాయలసీమ అని వివరించారు. అనంతపురం విద్యా రంగంలో కీలక కేంద్రంగా అభివృద్ధి చెందిందని, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జేఎన్‌టీయూ, శ్రీ సత్యసాయి ఉన్నత విద్యా సంస్థ, ప్రభుత్వ వైద్య కళాశాల, శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలతో పాటు అనేక విద్యాసంస్థలు ఇక్కడ ఉన్నాయని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రాష్ట్ర ఉన్నత విద్యా రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికిందని గవర్నర్ అన్నారు. సామాజిక, సాంస్కృతిక అవసరాలకు అనుగుణంగా వినూత్న విద్యా కార్యక్రమాలను రూపొందిస్తూ భవిష్యత్తులో ఈ విశ్వవిద్యాలయం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

విలువల ఆధారిత విద్య, పరస్పర చర్చలకు ప్రాధాన్యమిచ్చే బోధన, ప్రత్యక్ష అనుభవాధారిత అభ్యాసం ద్వారా విద్యార్థులను విజ్ఞానవంతులుగా, బాధ్యతాయుతమైన భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు విశ్వవిద్యాలయం కృషి చేస్తోందని కొనియాడారు. పరిశ్రమలతో భాగస్వామ్యాన్ని పెంపొందిస్తూ, స్వల్పకాలిక, దీర్ఘకాలిక వృత్తి విద్యా కోర్సులు, బహుళ విభాగాల కోర్సులను ప్రవేశపెట్టాలనే లక్ష్యం అభినందనీయమన్నారు.

జాతీయ విద్యా విధానం–2020 బహుళ విభాగాల విద్యకు ప్రాధాన్యం కల్పిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. విజ్ఞానశాస్త్రంతో పాటు కళలు లేదా ఒక ప్రధాన విద్యా విభాగంతో పాటు మరో విభాగాన్ని అభ్యసించే అవకాశాన్ని ఈ విధానం కల్పిస్తోందని చెప్పారు. దీంతో విమర్శనాత్మక ఆలోచన, సమస్యల పరిష్కార సామర్థ్యం వంటి నైపుణ్యాలు పెంపొందుతాయని వివరించారు.

ఎంపిక ఆధారిత క్రెడిట్ విధానం, బహుళ ప్రవేశ–నిష్క్రమణ అవకాశాల ద్వారా సమగ్ర విద్యను అందించడమే జాతీయ విద్యా విధానం లక్ష్యమని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థలు అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు.

పట్టభద్రులైన విద్యార్థులకు ఇది విద్యా జీవితానికి ముగింపు కాదని, కొత్త జీవితానికి ఆరంభమని గవర్నర్ అన్నారు. నిరంతరం నేర్చుకుంటూ, ఆత్మవిశ్వాసంతో లక్ష్యాలను సాధించే దిశగా ముందుకు సాగాలని సూచించారు. స్వామి వివేకానంద సందేశాన్ని ఉటంకిస్తూ, “‘నేను చేయలేను’ అని ఎప్పుడూ అనొద్దు. మీలో అపారమైన శక్తి ఉంది. మీరు ఏదైనా సాధించగలరు” అని విద్యార్థులకు స్ఫూర్తినిచ్చారు.

తల్లిదండ్రుల త్యాగం, ప్రేమ, ప్రోత్సాహం వల్లే విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొంటూ వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కార్యక్రమానికి ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్.ఏ. కోరికి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.