ఆర్టీసీ బస్సు-లారీ ఢీ

నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు

తిమ్మాపూర్, ఆంధ్రప్రభ: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బుధవారం ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు లారీని ఢీకొట్టిన ఘటనలో నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీఏ కార్యాలయంలో ఫిట్‌నెస్ పరీక్ష కోసం వెళ్తున్న లారీ రాజీవ్ రహదారిపై యూ-టర్న్ తీసుకుంటున్న సమయంలో జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న ఎల్‌ఎండీ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ ఎస్‌ఐ తెలిపారు.