ఏజెన్సీకి మరో 2,000 ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
వినతిపత్రం అందజేత…
ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ : ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు ఇందిరమ్మ గృహాల పథకం రెండో విడతలో అదనంగా 2,000 ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కలకు వినతిపత్రం అందజేశారు.
ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుతో కలిసి రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే బొజ్జు పటేల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు అదనపు గృహాలు కేటాయించడం ద్వారా ఆదివాసీ, గిరిజన కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ అధిక సంఖ్యలో ఆదివాసీ కుటుంబాలు పూరి గుడిసెలు, తాత్కాలిక నివాసాల్లోనే జీవనం సాగిస్తున్నాయని, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటు, మౌలిక సదుపాయాల కొరత కారణంగా శాశ్వత గృహాలు నిర్మించుకోలేకపోతున్నారని వివరించారు.
ఈ నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కూడా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించి, అదనంగా 2,000 ఇళ్లను మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరినట్లు తెలిపారు. ఆదివాసీ, గిరిజన కుటుంబాల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్ రావు తదితరులు పాల్గొన్నారు.
