ఏజెన్సీ ప్రాంతాలకు అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి
ఉట్నూర్/జైనూర్, ఆంధ్రప్రభ: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు రెండో విడతలో అదనంగా 2,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ బుధవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇళ్ల పథకం తొలి విడతలో ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు అదనపు ఇళ్లు కేటాయించడం ద్వారా ఆదివాసీ కుటుంబాల సొంతింటి కలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా ముందడుగు వేసిందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పటికీ అనేక గిరిజన కుటుంబాలు పూరి గుడిసెల్లో, తాత్కాలిక నివాసాల్లోనే జీవిస్తున్నాయని, భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక వెనుకబాటు కారణంగా శాశ్వత గృహాలు నిర్మించుకోలేకపోతున్నాయని వివరించారు.
ఈ నేపథ్యంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో కూడా ఐటీడీఏ పరిధిలోని ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించి అదనంగా 2,000 ఇళ్లను మంజూరు చేయాలని మంత్రులను కోరినట్లు తెలిపారు. ఆదివాసీ కుటుంబాల గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్‌రావు పాల్గొన్నారు.
