ఉమామహేశ్వర స్వామిని దర్శించుకున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్
అచ్చంపేట, ఆంధ్రప్రభ: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలోని శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఐ. రాణి కుముదిని బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ, ఉమాదేవి పూజ, కుంకుమార్చన, స్వామివారి అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజల అనంతరం అర్చకులు శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వచనం అందజేశారు.
ఈ సందర్భంగా రాణి కుముదిని ఆలయ చరిత్ర, విశిష్టత గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయ పరిసర ప్రాంతాల్లోని పాపనాశనం, ప్రకృతి అందాలు, జలధారలను వీక్షించారు. ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో ఎంతో ఆహ్లాదకరంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. అలాగే ఆలయంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రశంసిస్తూ, భక్తులకు అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు.
ఈ కార్యక్రమానికి ఆలయ పాలక మండలి చైర్మన్ బీరం మాధవ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, తహసీల్దార్ సైదులు, డీఎస్పీ పల్లె శ్రీనివాసులు, సీఐ నాగరాజు, కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ఆలయ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
