భీంగల్ మున్సిపాలిటీని సందర్శించిన ట్రైనీ కలెక్టర్

భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ట్రైనింగ్ కలెక్టర్ సురేష్ పామురి, ఐఏఎస్ బుధవారం భీంగల్ మున్సిపాలిటీని సందర్శించారు. ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న ఆయనకు కమిషనర్ డి. గజానంద్ స్వాగతం పలికారు. అనంతరం అధికారులతో సమావేశమై మున్సిపాలిటీ పరిధిలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనా విధానం, పారిశుధ్య నిర్వహణ, ఆదాయ వనరులు, పౌర సేవలపై సమీక్ష నిర్వహించారు.

అనంతరం పట్టణంలోని పలు అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలించి వాటి పురోగతిపై అధికారులకు పలు సూచనలు చేశారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రైనేజీల పరిశుభ్రత, దోమల నివారణ చర్యలు, చెత్త సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అలాగే ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించే విధానంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు.

అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి-స్వామి, వైస్ చైర్‌పర్సన్ సంటి లత-నర్సయ్య, కౌన్సిలర్లు ట్రైనింగ్ కలెక్టర్ సురేష్ పామురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.