YS Jagan Press Meet | ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు
YS Jagan Press Meet | ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు
చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
YS Jagan Press Meet | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, శాంతిభద్రతల పరిస్థితి, కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రంలో సంక్షేమ పథకాల గురించే చర్చ జరిగేదని, తమ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమమే ప్రధాన అజెండాగా ఉండేదని జగన్ పేర్కొన్నారు. ప్రస్తుతం మాత్రం ‘రెడ్‌బుక్ అరాచకాలు, కస్టోడియల్ మరణాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలు’ వంటి అంశాలే చర్చనీయాంశాలుగా మారాయని విమర్శించారు.
రాష్ట్రంలో చట్ట పాలన బలహీనపడిందని, పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలన్నా ప్రజలు భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని అన్నారు.
ఇటీవల జరిగిన సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి ఘటనలను ప్రస్తావిస్తూ, ఇవి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనాలని జగన్ పేర్కొన్నారు. జర్నలిస్టులు సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై ఒత్తిడి తెస్తున్నారని, చట్టాన్ని, పోలీసు వ్యవస్థను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుందని ఆరోపించారు.
అలాగే, కస్టడీలో మరణించిన వారి ఘటనలపై కూడా ఆయన స్పందించారు. కస్టడీలో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు కూడా అప్పగించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా? అని ప్రశ్నించారు. సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అన్నారు. రౌడీషీటర్ ను వెనకేసుకుని వస్తారా అన్నారు. ప్రజల నుంచి ఛీత్కారాలు రావడంతో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారన్నారు. 46 రోజులు సాయికృష్ణ కేసును తొక్కిపెట్టారన్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చెప్పాల్సిన బాధ్యత సీఎంగా చంద్రబాబుకు లేదా ? అన్నారు. డీజీపీని చంద్రబాబు కాపాడుతారన్నారు.
సీపీ ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ కృష్ణలంక పీఎస్ లో సాయికృష్ణను అప్పగించిందన్నారు. సాయికృష్ణ బంధువులు డీజీపీకి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదన్నారు. కోర్టులో ప్రవేశపెట్టలేదని అడిగితే సీపీ పట్టించుకోలేదన్నారు.ఈ ఘటనలన్నీ దిగజారిపోతున్న వ్యవస్థకు అద్దం పడుతున్నాయన్నారు. మరణ వాంగ్మూలానికి విలువ లేదా?. ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా? అని ప్రశ్నించారు.
