భీమ్‌గల్ నూతన ఏడీగా రాజేందర్ రెడ్డి బాధ్యతల స్వీకారం

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండల విద్యుత్ శాఖ నూతన అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీ)గా రాజేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గత కొంతకాలంగా ఇన్‌చార్జి ఏడీ ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ పరిపాలన కొనసాగుతుండగా, ప్రభుత్వం ఇటీవల ఆయనను శాశ్వత ఏడీగా నియమించింది.

బాధ్యతలు స్వీకరించిన అనంతరం టౌన్ ఏఈ సత్యప్రసాద్, శాఖ అధికారులు, సిబ్బంది, లైన్‌మెన్లు రాజేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు కృషి చేస్తానన్నారు. విద్యుత్ అంతరాయాలను త్వరితగతిన పరిష్కరించడం, పెండింగ్ సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వడం, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణపై ప్రత్యేక చర్యలు చేపట్టి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టౌన్ ఏఈ సత్యప్రసాద్, విద్యుత్ శాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది, మండలంలోని వివిధ గ్రామాల లైన్‌మెన్లు పాల్గొన్నారు.