India vs England | ఇంగ్లండ్‌తో నేడు తొలి టీ20..
India vs England | ఇంగ్లండ్‌తో నేడు తొలి టీ20..
గెలుపే లక్ష్యంగా బరిలోకి టీమిండియా
ఐర్లాండ్ సిరీస్ పరాజయాల తర్వాత పునరాగమనంపై భారత్ దృష్టి
చెస్టర్-లే-స్ట్రీట్‌లో రాత్రి 10 గంటలకు తొలి పోరు..
ఇంగ్లండ్ బలమైన జట్టుతో సిద్ధం
India vs England | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐర్లాండ్ చేతిలో ఎదురైన సిరీస్ ఓటమిని మరచి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలని భావిస్తున్న భారత క్రికెట్ జట్టు నేడు ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20లో తలపడనుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా చెస్టర్-లే-స్ట్రీట్ వేదికగా రాత్రి 10 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమిండియాకు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. మరోవైపు స్వదేశంలో ఆడుతున్న ఇంగ్లండ్ కూడా బలమైన బ్యాటింగ్, సమతూక బౌలింగ్‌తో భారత్‌కు గట్టి సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి పోరే ఇరు జట్లకు ఎంతో కీలకంగా మారింది. భారత్ విజయంతో ఆరంభించి ఐర్లాండ్ సిరీస్ పరాజయాల మచ్చను చెరిపేయాలని చూస్తుండగా, స్వదేశంలో ఆధిపత్యాన్ని కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది.
ఐర్లాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 0-2తో కోల్పోయిన భారత్‌కు ఈ పర్యటన ప్రతిష్ఠాత్మకంగా మారింది. సిరీస్‌ను విజయంతో ఆరంభించి ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందాలన్న లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. అయితే హ్యారీ బ్రూక్ సారథ్యంలో ఇంగ్లండ్ కూడా దూకుడు ప్రదర్శించాలనే పట్టుదలతో ఉండటంతో తొలి మ్యాచ్ ఆసక్తికరంగా మారింది.
ఓపెనర్లపైనే అందరి దృష్టి
భారత్ తరఫున మరోసారి అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఓపెనర్లుగా బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్‌లో అభిషేక్ అర్ధశతకానికి చేరువగా ఆడి ఆకట్టుకోగా, రెండో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. సంజు శాంసన్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ పరుగులు చేయలేకపోయాడు. అయినప్పటికీ గతంలో కీలక టోర్నీల్లో మెరుగైన ప్రదర్శనలు చేసిన అనుభవం దృష్ట్యా అతనిపై జట్టు యాజమాన్యం విశ్వాసం కొనసాగించే అవకాశముంది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్‌లో అవకాశం దక్కుతుందా అన్న అంశం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ప్రస్తుతం అతను బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మిడిలార్డర్లో స్థిరత్వం
భారత్ మిడిలార్డర్లో పెద్దగా మార్పులు ఉండే సూచనలు లేవు. ఇషాన్ కిషన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముండగా, అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు సమతూకాన్ని అందించనున్నారు.
వరుణ్‌కు చాన్స్?
బౌలింగ్ విభాగంలో మాత్రం ఒక మార్పు చోటుచేసుకునే అవకాశముంది. గాయం నుంచి కోలుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అతను సూర్యాన్ష్ షెడ్జ్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం. పేస్ దాడిని అర్షదీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ ముందుండి నడిపించనున్నారు.
ఆర్చర్‌కు విశ్రాంతి..
ఇంగ్లండ్ జట్టుకు కీలక పేసర్ జోఫ్రా ఆర్చర్ తొలి మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. అయితే ఇది గాయం కారణంగా కాదని, వరుస మ్యాచ్‌ల అనంతరం వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా విశ్రాంతి ఇచ్చినట్లు ఇంగ్లండ్ యాజమాన్యం వెల్లడించింది. అతని స్థానంలో ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్ పేస్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. స్పిన్ విభాగంలో ఆదిల్ రషీద్, లియామ్ డాసన్ కీలక పాత్ర పోషించనున్నారు.
బలంగా ఇంగ్లండ్ బ్యాటింగ్
ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్ భారత్‌కు కఠిన పరీక్షగా మారనుంది. ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్ ఓపెనింగ్ బాధ్యతలు చేపట్టనుండగా, కెప్టెన్ హ్యారీ బ్రూక్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, విల్ జాక్స్, సామ్ కరన్ వంటి విధ్వంసక ఆటగాళ్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం పటిష్ఠంగా కనిపిస్తోంది.
మ్యాచ్‌ల షెడ్యూల్ (భారత కాలమానం ప్రకారం)
జూలై 1: తొలి టీ20 – చెస్టర్-లే-స్ట్రీట్ – రాత్రి 10:00 గంటలకు
జూలై 4: రెండో టీ20 – మాంచెస్టర్ – సాయంత్రం 7:00 గంటలకు
జూలై 7: మూడో టీ20 – నాటింగ్‌హామ్ – రాత్రి 10:00 గంటలకు
జూలై 9: నాలుగో టీ20 – బ్రిస్టల్ – రాత్రి 10:00 గంటలకు
జూలై 11: ఐదో టీ20 – సౌతాంప్టన్ – రాత్రి 10:00 గంటలకు
