బాధితుల ఇంటికే వెళ్లి ఫిర్యాదులు స్వీకరిస్తాం: లక్షేట్టిపేట సీఐ

జన్నారం, ఆంధ్రప్రభ: ప్రత్యేక పరిస్థితుల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా, నేరుగా వారి ఇళ్లకే వెళ్లి ఫిర్యాదులు స్వీకరించి కేసులు నమోదు చేస్తామని లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్ ఆదేశాల మేరకు బుధవారం జన్నారంలోని వరద బాధితుల కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు అందిస్తున్నామని చెప్పారు. గ్రామాలకు అనుమానాస్పద వ్యక్తులు వస్తే వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

చిన్నారులను పనులకు పంపించవద్దని, బాల కార్మికులను గుర్తించి వారికి విముక్తి కల్పిస్తామని, వారిని పనుల్లో పెట్టుకున్న యజమానులతో పాటు తల్లిదండ్రులపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. తనిఖీల్లో పత్రాలు లేని 47 మోటార్‌సైకిళ్లు, ఒక ఆటోను సీజ్ చేసినట్లు తెలిపారు. అలాగే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఒక లీటర్ గుడుంబా స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో జన్నారం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్, లక్షేట్టిపేట ఎస్సై గోపతి సురేష్, దండేపల్లి ఎస్సై గుండేటి రాజవర్ధన్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.