Cath Lab | గోదావరిఖనిలో రూ.50 కోట్లతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్
Cath Lab | గోదావరిఖనిలో రూ.50 కోట్లతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్
గోల్డెన్ అవర్‌లోనే గుండెకు ప్రాణరక్షక వైద్యం
రూ.50 కోట్లతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు
ఉత్తర తెలంగాణ ప్రజలకు వరంగా సింగరేణి ఆస్పత్రి
సాధారణ ప్రజలకు కూడా అందుబాటులో గుండె వైద్య సేవలు
Cath Lab | గోదావరిఖని(పెద్దపల్లి జిల్లా), ఆంధ్రప్రభ: గుప్పెడు గుండెకు సింగరేణి సంస్థ భరోసా ఇస్తోంది.. కోల్ బెల్ట్ ప్రజలకు గోల్డెన్ అవర్లో వైద్య సేవలు అందించేందుకు క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. కార్మికుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా గుండె సంబంధిత వ్యాధుల పరిష్కారానికి సింగరేణి సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.50 కోట్ల ఖర్చుతో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. నిర్వహణకు ఏటా సుమారు రూ.6 కోట్లు వెచ్చించనున్నారు. వైద్య రంగంలో సరికొత్త ఒరవడులను సృష్టిస్తున్న రెనె ఆస్పత్రి గ్రూపునకు నిర్వహణ బాధ్యత అప్పగించింది.
ఇటీవలి కాలంలో వయోభేదం లేకుండా గుండెపోటు, గుండె సంబంధిత సమస్య తలెత్తుతోంది. ఈ సమస్య తలెత్తిన తొలి గంట అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు. దీన్ని వైద్య భాషలో గోల్డెన్ అవర్గా పేర్కొంటారు. ఈ సమయంలో సత్వరమే చికిత్స అందించగలిగితే విలువైన ప్రాణాలను కాపాడవచ్చు. సింగరేణి విస్తరించిన ప్రాంతాల్లో కంపెనీకి చెందిన అనేక ఏరియా ఆసుపత్రుల్లో కార్డియాక్ సంబంధిత సేవలు పరిమితంగా ఉన్నాయి. ఇప్పటి వరకు గుండెపోటు వచ్చిన రోగులను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ వంటి సుదూర నగరాల ఆస్పత్రులకు తరలిస్తున్నారు. సుదీర్ఘ ప్రయాణంలో గోల్డెన్ అవర్ వృథా అవుతుండేది.
ఈ నేపథ్యంలోనే గోదావరిఖనిలో అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ను సింగరేణి ఏర్పాటు చేసింది. గుండెపోటు వచ్చిన తొలి గంట అత్యంత కీలకం. అదే సమయంలో యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ వంటి చికిత్సలు అందితే రోగి ప్రాణాలు కాపాడే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఈ అత్యవసర సేవల ప్రాధాన్యాన్ని గుర్తించిన సింగరేణి యాజమాన్యం, అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా అత్యాధునిక సాంకేతికతతో ఈ క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేసింది. కోల్ బెల్ట్ ప్రజలకు సకాలంలో, తక్కువ వ్యవధిలోనే అత్యుత్తమ వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కార్మికుల ఆరోగ్యం కోసం సింగరేణి సంస్థ ఏటా రూ.300 కోట్లు వెచ్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రుల రెఫరల్స్ కోసమే అధిక మొత్తం నిధులను కేటాయిస్తోంది. గత ఏడాది మాత్రమే హృద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న సుమారు 3,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను భూపాలపల్లి, బెల్లంపల్లి, రామగుండం, రామకృష్ణాపూర్ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకు రిఫర్ చేశారు.
ఉత్తర తెలంగాణకు వరం
గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు ఉత్తర తెలంగాణకు ఒక వరం లాంటిది. ఏరియా ఆస్పత్రిలో కార్డియాలజీ విభాగం ఏర్పాటవుతుంది. ఇందులో ఐదు బెడ్ల సామర్థ్యం గల ఇంటెన్సివ్ కార్డియాక్ కేర్ యూనిట్, పది బెడ్ల సామర్థ్యంలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ప్రత్యేక గదులతో ఔట్ పేషెంట్ బ్లాక్ ఉంటాయి.
గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, పెద్దపల్లి, భూపాలపల్లి, మంథని తదితర పరిసర ప్రాంతాలతోపాటు మొత్తం కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రజలకు ఈ క్యాథ్ ల్యాబ్ ఎంతో ఉపయోగపడనుంది. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో ఏర్పాటు చేసిన క్యాథ్ ల్యాబ్ కోసం ఏడేళ్లలో సింగరేణి సంస్థ దాదాపు రూ.50 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉన్నట్లు సింగరేణి యాజమాన్యం చెబుతోంది.
పెద్దపల్లి, మంచిర్యాల, కొమురమ్ భీమ్ ఆసిఫాబాద్, ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో నివసిస్తున్న వేలాది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణి ఉద్యోగులతోపాటు సమీప గ్రామాల ప్రజల హృదయాలకు సింగరేణి గట్టి భరోసాను ఇచ్చినట్లయింది.
ఇతరులకు కూడా వైద్యం
గోదావరిఖనిలో త్వరలో ప్రారంభం కానున్న సింగరేణి ఆస్పత్రిలో సాధారణ ప్రజలకు కూడా ప్రభుత్వం ఇచ్చిన టారిఫ్ ప్రకారం వైద్య సేవలు అందించనున్నారు. ప్రతినెలా దాదాపు మూడు వేల మందికి పైగా ఈ సేవలను వినియోగించుకుంటారని అంచనా వేస్తున్నారు. ఇక్కడ క్యాథ్ ల్యాబ్ ఉన్న బెడ్ల సామర్థ్యంలో 50 శాతం సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, విశ్రాంత సింగరేణి కార్మికులకు రిజర్వు చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం ఈ క్యాథ్ ల్యాబ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ పేర్కొన్నారు. గుండె సంబంధిత వ్యాధుల చికిత్స కోసం ఇకపై సుదూర ప్రాంతాల్లోని కార్పొరేట్ వైద్యం కోసం తరలి వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.
