3-Spot-Dead : గన్నవరంలో లారీ బీభత్సం Andhra Prabha Sad New
3-Spot-Dead : గన్నవరంలో లారీ బీభత్సం Andhra Prabha Sad New
- తల్లి,నాలుగేళ్ల కుమారుడు ,,,
- స్కూటీపై వెళ్తున్న మరో వ్యక్తి స్పాట్ డెడ్
- టైర్ పేలి అదుపు తప్పిన లారీ
- రెండు భారీ వాహనాల మధ్య కారు నుజ్జునుజ్జు..
- మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
(గన్నవరం, ఆంధ్రప్రభ)
3-Spot-Dead : కృష్ణాజిల్లా గన్నవరం వెస్ట్ బైపాస్‌లోని బీబీగూడెం సమీపంలో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. జాతీయ రహదారిపై టైర్ పేలడంతో అదుపు తప్పిన భారీ వాహనం కారును ఢీకొనడంతో కారు రెండు భారీ వాహనాల మధ్య ఇరుక్కుపోయి నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో తల్లి, నాలుగేళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందగా, స్కూటీపై వెళ్తున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
3-Spot-Dead : పరామర్శకు వెళ్లి.. వస్తుండగా…

కైకలూరు మండలం పెంచికలమర్రు గ్రామానికి చెందిన జయమంగళ విజయ్ తన భార్య భువనైక నాగదుర్గ (25), కుమారుడు కారుణ్య నాగసాయి (4), బంధువులు జయమంగళ వెంకటరాజు, లక్ష్మితో కలిసి విజయవాడలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లి రమాదేవిని పరామర్శించేందుకు వెళ్లారు. అనంతరం రమాదేవి, లక్ష్మిలను ఆస్పత్రిలో ఉంచి విజయ్ తన భార్య, కుమారుడితో కలిసి ఏలూరు వైపు కారులో బయలుదేరాడు. గన్నవరం వెస్ట్ బైపాస్‌లోని బీబీగూడెం సమీపానికి చేరుకోగానే మొదటి లైన్లో వెళ్తున్న గూడ్స్ లారీ టైర్ ఒక్కసారిగా పేలింది. దీంతో అదుపు తప్పిన లారీ రెండో లైన్లో వెళ్తున్న కారును బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు మూడో లైన్లో ప్రయాణిస్తున్న మరో భారీ వాహనం మధ్య ఇరుక్కుపోయి పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదంలో కారు వెనుక సీటులో కూర్చున్న భువనైక నాగదుర్గ, నాలుగేళ్ల కారుణ్య నాగసాయి అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న జయమంగళ విజయ్ తీవ్రంగా గాయపడగా, అతడిని విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అదే సమయంలో రహదారి పక్కగా యాక్టివా స్కూటీపై వెళ్తున్న విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన దాసరి వెంకటేశ్వరరావు (47)ను మూడో లైన్లో ఉన్న భారీ లారీ ఢీకొట్టడంతో ఆయన కూడా అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న గన్నవరం పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను గన్నవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిమిత్తం భద్రపరిచారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
