చేసిన ప్రతీ పని లెక్కలతో చెబుతా : సీఎం రేవంత్

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : తమ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్న వారందరికీ లెక్కలతో సమాధానం చెబుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. ఇది రైతుల పండుగ అని, రైతుల కోసం నిర్వహిస్తున్న సభ కావడంతో వ్యవసాయానికి సంబంధించిన అంశాలనే ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, ఇతర సభ్యులు, రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల్లో పాల్గొన్న రైతులందరూ వ్యవసాయాభివృద్ధిపైనే దృష్టి సారించారని చెప్పారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 25.35 లక్షల మంది రైతులకు రూ.20,600.77 కోట్లతో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసిన విషయం వాస్తవం కాదా? అని సీఎం ప్రశ్నించారు. గ్రామసభల్లో రైతుల పేర్లను చదివి వినిపిస్తూ పూర్తి పారదర్శకంగా రుణమాఫీ అమలు చేశామని తెలిపారు. గత ప్రభుత్వం రైతుబంధు నిధుల్లో సుమారు రూ.7 వేల కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని, తాము అధికారంలోకి వచ్చిన నెల రోజులు తిరగకముందే ఆ బకాయిలన్నింటినీ చెల్లించామని చెప్పారు.

అదేవిధంగా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు చెల్లించాల్సిన బకాయిలను కూడా తమ ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని తెలిపారు. రైతుబంధు కింద గత ప్రభుత్వం సంవత్సరానికి రూ.10 వేల చొప్పున ఇచ్చేదని, తమ ప్రభుత్వం దానిని రూ.12 వేలకు పెంచి రైతు భరోసాగా అమలు చేస్తోందని పేర్కొన్నారు.

ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రూ.27 వేల కోట్లకుపైగా జమ చేశామని, తాజాగా మరో రూ.9 వేల కోట్ల నిధుల విడుదలకు తొలి విడత ప్రారంభించామని వెల్లడించారు. తొమ్మిది రోజుల్లో రూ.9 వేల కోట్ల మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. ఈ విడతతో కలిపి రైతు భరోసా కింద మొత్తం రూ.36 వేల కోట్లకు పైగా రైతులకు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

ఉచిత విద్యుత్ కాంగ్రెస్ పేటెంట్

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు కరెంట్ ఉండదని ప్రచారం చేశారని, కానీ ఉచిత విద్యుత్‌కు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన పాదయాత్రలో రైతులు కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు చూపిస్తూ తమ కష్టాలను వివరించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు.

2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ అమలు చేస్తూ, విద్యుత్ బిల్లులు రద్దు చేయడంతో పాటు రైతులపై నమోదైన క్రిమినల్ కేసులను ఎత్తివేస్తూ తొలి సంతకం చేశారని సీఎం గుర్తుచేశారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వం కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోందని, ఇందుకోసం గత 30 నెలల్లో రూ.30 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. నెలకు సగటున రూ.1,000 కోట్ల చొప్పున రైతుల ఉచిత విద్యుత్‌పై వ్యయం చేస్తున్నామని పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్ల బకాయిలను తమ ప్రభుత్వం పూర్తిగా చెల్లించిందని, రైతులకు బోనస్‌గా దాదాపు రూ.4 వేల కోట్లు అందించామని చెప్పారు. వ్యవసాయ పనిముట్ల కోసం రూ.2 వేల కోట్లు, రైతు బీమా పథకానికి సుమారు రూ.3,500 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

గత పదేళ్లలో పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.1.68 లక్షల కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు జరిగితే, తమ ప్రభుత్వం కేవలం రెండున్నరేళ్లలోనే రూ.80 వేల కోట్లకు పైగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు చెల్లింపులు చేసిందని తెలిపారు.

“ఈ లెక్కలన్నీ కలిపి చూస్తే.. గత 30 నెలల్లో రైతాంగం కోసం రూ.1.75 లక్షల కోట్లు ఖర్చు చేశాం. అంటే నెలకు సగటున రూ.6 వేల కోట్లు రైతుల కోసం వెచ్చిస్తున్నాం. గత ప్రభుత్వం నెలకు రూ.2,500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?.. బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ సవాల్

రైతుల సంక్షేమంపై అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి చర్చకు రావాలని ప్రతిపక్ష బీఆర్ఎస్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం ఏం చేసిందో, తమ ప్రభుత్వం 30 నెలల్లో ఏం చేసిందో ప్రజల ముందే చర్చిద్దామని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామని, రంగారెడ్డి జిల్లా వరకు నీరు తీసుకొస్తామని చెప్పి భారీ ప్రాజెక్టు చేపట్టారని విమర్శించారు. రూ.1.50 లక్షల కోట్ల అంచనాతో ప్రారంభించిన కాలేశ్వరం ప్రాజెక్టుకు దాదాపు రూ.1.02 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించారని, కానీ మూడేళ్లకే ప్రాజెక్టు కుంగిపోయిందని ఆరోపించారు. “కాలేశ్వరం కాస్తా కూలేశ్వరం అయింది.. లక్ష కోట్ల ప్రజాధనం గోదావరిలో కలిసిపోయింది” అని సీఎం వ్యాఖ్యానించారు.

గతంలో రాష్ట్రంలో ఏ పంట పండినా అది కాలేశ్వరం ఘనతేనని చెప్పారని, కానీ గత మూడేళ్లుగా కాలేశ్వరం నుంచి చుక్క నీరు కూడా ఉపయోగించకుండానే తెలంగాణ రైతులు రికార్డు స్థాయిలో పంటలు పండించారని అన్నారు. ఈ ఏడాది 1.88 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా సీఎం గుర్తు చేశారు. రైతు రుణమాఫీ పూర్తి చేయలేదని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, కోటి ఎకరాలకు సాగునీరు వంటి హామీలు అమలు కాలేదని విమర్శించారు. వ్యవసాయం, ఉద్యానవనం, రొయ్యల సాగు వంటి రంగాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించిన సీఎం, “వ్యవసాయ సంస్కృతి కాదు.. తాగుడు సంస్కృతిని పెంచారు. సందు సందులో బెల్ట్ షాపులు పెట్టారు. ప్రతిపక్షాలను ఫోన్ ట్యాపింగ్‌తో వేధించారు” అని తీవ్ర విమర్శలు చేశారు.