ఏపీఎల్‌లో నేడు క్వాలిఫైయర్-2 హోరాహోరీ

క్యాపిటల్ అమరావతి రాయల్స్‌తో సింహాద్రి వైజాగ్ లయన్స్ ఢీ
గెలిచిన జట్టుకే భీమవరం బుల్స్‌తో ఫైనల్ పోరు
మంగళగిరి ఏసీఏ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్-5లో అత్యంత కీలకమైన క్వాలిఫైయర్-2 మ్యాచ్ నేడు మంగళగిరిలోని ఏసీఏ స్టేడియంలో జరగనుంది. క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు ఇప్పటికే క్వాలిఫైయర్-1లో గెలిచి ఫైనల్ చేరిన భీమవరం బుల్స్‌తో టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

మ్యాచ్ ప్రారంభానికి ముందే మంగళగిరి ఏసీఏ స్టేడియానికి పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు చేరుకుని సందడి చేస్తున్నారు. ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో క్వాలిఫైయర్-2 ఉత్కంఠభరితంగా సాగుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీఎల్ సీజన్-5కు రాష్ట్రవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ప్రతి మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండటంతో లీగ్‌కు మరింత ఆదరణ పెరిగింది. ఫైనల్ చేరాలనే లక్ష్యంతో ఇరు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు సిద్ధమయ్యాయి. అభిమానులు కూడా హోరాహోరీ పోరును ఆస్వాదించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.