రోడ్ల మంజూరుపై ఎమ్మెల్యే నారాయణరెడ్డికి సన్మానం..

ఆమనగల్లు, ఆంధ్రప్రభ : కల్వకుర్తి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు రూ.100 కోట్ల వ్యయంతో 160 కిలోమీటర్ల రహదారుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని సోమవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు.

డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు యాట నర్సింహాతో కలిసి ఎమ్మెల్యేకు పూలమాలలు, శాలువా కప్పి సత్కరించి స్వీట్లు తినిపించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క సహకారంతో నియోజకవర్గానికి రహదారులు మంజూరయ్యాయని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి తండాకు రహదారి సౌకర్యం కల్పించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండల్ రెడ్డి, గుర్రం కేశవులు, వెంకటేశ్వరరావు, వేణుగోపాల్, మండ్లి రాములు, గోపాల్ రెడ్డి, రఘునాయక్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.