మాదన్నపేట వాగు అభివృద్ధికి ఆర్డీఓకు రైతుల వినతి..

నర్సంపేట క్రైం, ఆంధ్రప్రభ: నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు పారకం రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రైతు సేవా సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అబోతు రాజు యాదవ్ ఆధ్వర్యంలో సోమవారం ఆర్డీఓ (RDO)కు వినతిపత్రం అందజేశారు. మాదన్నపేట నుంచి అయ్యప్ప టెంపుల్ వరకు ఉన్న వాగు పూడికతో నిండిపోవడం వల్ల వరద నీరు పొలాల్లోకి చేరి పంటలు నష్టపోతున్నాయని, అలాగే రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.

మాదన్నపేట చెరువు నుంచి ఎన్టీఆర్ నగర్ చెక్‌డ్యామ్ మీదుగా అయ్యప్ప టెంపుల్ వరకు వాగును పూడికతీత చేసి, వెడల్పు చేయడంతో పాటు రైతుల సౌకర్యార్థం రహదారులు ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రెవెన్యూ శాఖ అధికారులు అనుమతులు మంజూరు చేస్తే, రైతులు మరియు రైతు సేవా సంక్షేమ సంఘం తరఫున సొంత నిధులతోనే వాగు విస్తరణ, మరమ్మతు పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని అబోతు రాజు యాదవ్ తెలిపారు. ఈ పనుల పూర్తి బాధ్యతను తమ సంఘమే తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు.